‘దళిత ద్రోహి చంద్రబాబు’ అనే ఫ్లెక్సీలతో అనంతపురంలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నాయకులు
సాక్షి నెట్‌వర్క్: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు, అకృత్యాలకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు. రాజధాని అమరావతిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడ్డ దళిత ద్రోహి బాబేనని ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బతిన్నా ఆయన బుద్ధి మారలేదని దుయ్యబట్టారు. దళితులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు వారే తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు.
► అధికారంలో ఉన్నంతకాలం దళితులను పట్టించుకోని బాబు నేడు మొసలికన్నీరు కారుస్తున్నారని నెల్లూరులో ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
► చంద్రబాబు దళితులను పావుగా వాడుకున్నారని కర్నూలులో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ నిప్పులు చెరిగారు.
► విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు.
► కృష్ణా జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి తానేటి వనిత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు నిరసనల్లో పాల్గొన్నారు.
► అనంతపురంలో ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, శ్రీకాకుళంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, సత్యవేడుల్లో ఎమ్మెల్యేలు ఎం.ఎస్.బాబు, ఆదిమూలం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
► గుంటూరులో జరిగిన నిరసనలో ఎమ్మెల్యేలు ముస్తఫా, కిలారి రోశయ్య, మద్దాళి గిరి తదితరులు పాల్గొన్నారు.
► కాకినాడలో జరిగిన నిరసనలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పాల్గొన్నారు. పి.గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు, రాజోలులో ఎస్సీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ నిరసన తెలిపారు.
► విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, శెట్టి ఫాల్గుణ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు.
గుంటూరులో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎంపీ సురేష్, ఎమ్మెల్యేలు శ్రీదేవి, గిరి, ముస్తఫా, రోశయ్య తదితరులు
ఇలా అన్నారు..
చంద్రబాబును అరెస్టు చేయాలి
► రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి.
► చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. అందుకే గత ఎన్నికల్లో దళితులంతా టీడీపీ ప్రభుత్వాన్ని ఓడించారు.
– ఏలూరులో మంత్రి తానేటి వనిత
పేదలను అణగదొక్కేందుకే చంద్రబాబు పుట్టారు
► ఐదేళ్ల పాలనలో దళితుల సంక్షేమం పట్టని చంద్రబాబు.. ఇప్పుడు వారిపై చూపిస్తున్న కపట ప్రేమ వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుసు.
► దళితులకు రాజకీయాలు ఎందుకని వ్యాఖ్యానించిన టీడీపీ నేతలు వారిపై సవతి తల్లి ప్రేమ చూపడం హాస్యాస్పదం.
– గుంటూరులో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే శ్రీదేవి
ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
► ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా’ అంటూ వ్యాఖ్యానించిన రోజు నుంచే దళితులు చంద్రబాబును తమ శాశ్వత శత్రువుగా చూస్తున్నారు. దళితులపై ఎవరు దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
► దళితులపై ఎక్కడ దాడి జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటోంది. విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం ఘటనలో ఏడుగురి అరెస్టే ఇందుకు నిదర్శనం. – విజయవాడలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment