సాక్షి, తిరుపతి: ‘‘ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప.. ఎల్లో మీడియాకు మరోకటి రాయాలనిపించడం లేదు.. నేను మాట్లాడింది కాకుండా.. ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు రాసింది.. నా మాటల్ని 100 శాతం వక్రీకరించింది’’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎల్లో మీడియా దివాళాకోరుతనంగా వ్యవహరిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపును ఓర్చుకోలేక పోతున్నారు. చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియా రాస్తోంది. బాబు, ఎల్లో మీడియా కలిసి కుట్రలు పన్నుతున్నారు’’ అంటూ మండిపడ్డారు.
రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయన ఎల్లో మీడియాకు బంట్రోతుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రఘురామకృష్ణంరాజు సిగ్గులేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సిగ్గుంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. వార్డు మెంబర్ కాని రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎంపీ అయ్యారు. కొమ్ములు లేని దున్నపోతుతో ఆయనను పోల్చవచ్చు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి.
‘‘చంద్రబాబు స్క్రిప్ట్‌నే ఆయన చదువుతున్నారు. బ్యాంకులను వేల కోట్లు మోసం చేసిన చరిత్ర రఘురామ కృష్ణంరాజుది. దమ్ముంటే ఆయన తన పదవికి రాజీనామా చేసి గెలవాలి. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు హుందాగా వ్యవహరించాలి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దయతో రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచారు.. సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదు. చంద్రబాబు వ్యవహారమంతా చీకటి ఒప్పందాలు చేసుకోవడమే’’ అంటూ పెద్దిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment