సాక్షి, విజయవాడ: తొలివిడత నామినేషన్ల సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో పాల్పడుతున్న దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సోమవారం అచ్చెన్నాయుడిపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘అచ్చెన్నాయుడి దౌర్జన్యాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయాలి. టీడీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషనర్ స్పందించాలి. చంద్రబాబు రౌడీ రాజకీయాలని పెంచిపోషిస్తున్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఫోన్‌లో ఏ విధంగా బెదిరించారో ఆధారాలు కూడా సమర్పించాం. గ్రామాలలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని టీడీపీ చూస్తోంది. ఎన్నికల నిబంధనలకి విరుద్దంగా మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు’’ అని ప్రశ్నించారు.
సురేష్‌పై చర్యలు తీసుకోవాలి: లేళ్ల అప్పిరెడ్డి
అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీలతో తిరుగుతూ వైఎస్సార్సీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దౌర్జన్యాలని చూశాం. ఆయన ప్రోద్బలంతోనే టీడీపీ మద్దతుదారు సురేష్ వైఎస్సార్సీపీపై దౌర్జన్యానికి దిగారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక విలువలతో వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోంది. పోలీస్ వ్యవస్ధపై టీడీపీ ఆరోపణలను ఖండిస్తున్నాం. డీజీపీ, పోలీస్ పనితీరును ఎస్ఈసీ సైతం అభినందించారు’’ అని తెలిపారు.
(చదవండి: అచ్చెన్న బరితెగింపు)
ఏపీ సీఎస్‌కు ఎస్ఈసీ లేఖ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కి లేఖ రాసింది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ప్రయాణిస్తే అది ఎన్నికల ప్రచారంగానే భావిస్తామని సీఎస్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు వినియోగించరాదని సూచించింది. చైర్మన్లతో పాటు ప్రభుత్వ అధికారులను తీసుకుని వెళ్లవద్దని.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటపుడు వారి నేమ్ బోర్డ్స్ ఉండవద్దని సీఎస్‌కు రాసిన లేఖలో సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment