సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, ఉద్యోగాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను తొలగించడమేంటని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా? అని అడిగారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలను గెలిపిస్తే నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా?. కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులను తొలగించడం కరెక్ట్ కాదు. అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు?. నాలుగు వేల మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడానికి ఒప్పుకోము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్, బీజేపీ నిలబెట్టుకోవాలి.
నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా?. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీకు చీమ కుట్టినట్టు అయినా లేదు. రూ.99కే మద్యం అందిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఉన్న 15000 మందిని రోడ్డున పడేశారు. మందు మీద రేటు తగ్గిస్తున్నారు.. నిత్యవసర వస్తువుల ధరల సంగతి ఏంటి?. ధరల స్థిరీకరణ కోసం గత ప్రభుత్వం 2000 కోట్లు ఏర్పాటు చేసి ధరలను అదుపులో పెట్టింది. పండగకు పప్పన్నం కాదు చారు అన్నం కూడా తినే పరిస్థితి లేదు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగితే తక్కువ ధరలు ఉన్న రాష్ట్రాల నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూరగాయలను తెప్పించేది. ధరలను అదుపులో పెట్టింది. రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించారు. వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.
లులూ కంపెనీ.. ప్రభుత్వం నుంచి రూ.1300 కోట్ల స్థలం తీసుకొని 600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటు కంటే పది రెట్లు పెట్టుబడి పెడితే ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటులో సగం కూడా పెట్టుబడులు లేకపోతే ఎలా?. అందుకే గతంలో లులూ కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పాము అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: బాదుడుపై బాబు ఫోకస్.. ఇదేనా సంపద సృష్టి: వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment