సాక్షి, అమరావతి: కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపై టీడీపీ అధినేతకు దిగులు పట్టుకుందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రెండు చోట్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందనే దిగులు చంద్రబాబుకు పట్టుకుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన సందర్భంగా వచ్చిన జనం స్థానికులు కాదనే మాటతోపాటు అనేక అభాండాలు వేశారని.. తన పాత నియోజకవర్గం చంద్రగిరి మాదిరిగానే కుప్పం కూడా వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తుందనే భయం బాబుకి పట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇక 2019 ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయినప్పటి నుంచి మంగళగిరిలో పార్టీ కార్యక్రమాలు పెరిగిపోయాయని ఇటీవల సమీక్షలో చంద్రబాబు తెగ సంబరపడిపోయారన్నారు.
పొత్తుల కారణంగానే మంగళగిరిలో టీడీపీ బలహీనపడిందని, గత ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. వాస్తవానికి తెలుగదేశం పుట్టినప్పటి నుంచి చూస్తే, మిత్రపక్షాలైన సీపీఎం, బీజేపీకి మంగళగిరి సీటు కేటాయించింది కేవలం నాలుగుసార్లు మాత్రమేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment