పట్టాభి బూతుల వీడియో రాష్ట్రపతికి చూపించారా? | YSRCP MP Vijayasai Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

పట్టాభి బూతుల వీడియో రాష్ట్రపతికి చూపించారా?

Published Wed, Oct 27 2021 12:24 PM | Last Updated on Thu, Oct 28 2021 4:36 AM

YSRCP MP Vijayasai Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం పరువు తీయాలని ఢిల్లీకి వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు ఓ ఉగ్రవాదిలా వ్యవహరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీనేత వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. స్వీయ ప్రయోజనాల కోసమే ఆయన పర్యటన సాగిందన్నారు. ఇకనైనా నడవడిక మార్చుకుని ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలని, కుట్రలను నమ్ముకుంటే బూడిదే మిగులుతుందని హితవు పలికారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వదిలేసిన ఏకైక పార్టీ టీడీపీ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికీ కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు నిబంధన వర్తింపచేసేలా పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు. లోక్‌సభలో పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు బీవీ సత్యవతి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డెప్ప, సంజీవ్‌కుమార్, తలారి రంగయ్యలతో కలిసి బుధవారం ఏపీ భవన్‌లో విజయసాయిరెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ..

షా కాన్వాయ్‌పై దాడి సీడీలను ఇచ్చారా?
తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అసలు రంగు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు, కేంద్ర పెద్దలకు ఇప్పటికే తెలిసింది కాబట్టే ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన్ను కలిసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వచ్చిన దారినే వెనుదిరిగారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం అసెంబ్లీ సీట్లు, 13 ఎంపీ సీట్లు వారికిచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు ఆయనకు ఏం చెప్పారు? పట్టాభి బోసిడీకే అని దూషించారని చెప్పారా? లేక ఆ పదానికి చాలా మంచి అర్థం ఉందని చెప్పారా? 36 గంటల బూతుల సమర్థన దీక్ష దేశం కోసం చేశానని చెప్పుకోవడానికి ఢిల్లీకి వచ్చారా? ప్రధాని మోదీని తిట్టిన వీడియోల సీడీ, గతంలో అమిత్‌షా తిరుపతి పర్యటన సమయంలో రాళ్ల దాడి సీడీలను రాష్ట్రపతికి ఆయన అందజేశారా? టీడీపీ హయాంలో గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ప్రెస్‌మీట్లు నిర్వహించి ఏపీ గంజాయికి కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించిన వీడియోలను చూపించారా? 

చదవండి: చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు అరెస్ట్‌ 

మీది ఓ పార్టీయేనా?
టీడీపీ పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్‌ చనిపోయేవరకు ప్రతి మహానాడులోనూ ఆర్టికల్‌ 356 రద్దు  చేయాలని తీర్మానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే ఆర్టికల్‌ ప్రయోగించాలని ఎలా కోరతారు? విధానాలు, సిద్ధాంతాలు లేని పార్టీ ఒక రాజకీయ పార్టీయేనా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబుకు ఫిల్తీ, ఫౌల్, అబ్యూజ్డ్, డెరిగేటరీ, డిఫమేటరీ... ఇటువంటి అన్‌ పార్లమెంటరీ పదాలు వాడకూడదని తెలియదా? రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజా ప్రతినిధులపై అసభ్యంగా మాట్లాడితే తిరగబడటం సహజం. ఎవరో ప్రేరేపించాల్సిన పనిలేదు. మాదకద్రవ్యాల వ్యవహారంతో ఏపీకి ఎటువంటి సంబంధం లేదని, డీజీపీ, నార్కోటిక్స్‌ బ్యూరో, ఎన్‌ఐఏ, ఇతర పోలీసు అధికారులు పదేపదే చెబుతున్నా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. గంజాయి వ్యాపారంలో లోకేశ్‌కు భాగస్వామ్యం ఉందన్న విషయం ప్రజలకు తెలుసు. చంద్రబాబు వల్ల ప్రాణభయంతోనే పట్టాభి మాల్దీవులకు పారిపోయి ఉంటారు.  

నేడు సీఈసీకి ఫిర్యాదు..
గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి టీడీపీ తీరుపై ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రపతి కోవింద్‌ అపాయింట్‌మెంట్‌ ఒకట్రెండు రోజుల్లో లభించే అవకాశం ఉంది. ఒకవేళ వీలు కాకుంటే దీపావళి తర్వాత ఆయన్ను కలుస్తాం.  

చదవండి: కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ, అమిత్‌ షా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement