సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య. దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోంది. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.
అందులో భాగంగానే ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నాం. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేస్తాం. కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తాం. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఆపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది.

పులివెందుల కాలేజీ పూర్తయినా చంద్రబాబు సీట్లు రాకుండా అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా అడ్డుకున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున నాలుగైదేళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీని దోచి పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇలాంటి విధ్వంసాన్ని ఏపీలో ఎప్పుడూ చూడలేదు. కానీ, తన మీడియా పవర్‌తో ఎదుటి వారిపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు.


