మాచర్ల(పల్నాడు జిల్లా): వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. శుక్రవారం ఆరో రోజు బస్సుయాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలోని మాచర్లలోని పార్క్ సెంటర్ వద్ద జరిగిన సభలో వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానేతకు సభ ఘనంగా నివాళులర్పించింది.
ఈ సభలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఎంపీలు కృష్ణ దేవరాయులు, విజయసాయి రెడ్డి, నందిగం సురేష్, ఎమ్మేల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి ,సునీత, కుంబా రవిబాబు, ఏసురత్నం, పలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బడుగు బలహీనర్గాలను సొంత బిడ్డల్లా చూసుకున్న ముఖ్యమంత్రి జగన్ తప్ప మరొకరు లేరు. దమ్మున్న నాయకుడు కాబట్టే కరోనా విపత్తులోనూ , రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా, వసతి దీవెన, పంట బీమా, జగనన్న తోడు, చేదోడు వంటి అనేక పథకాలు అమలు చేశారు.కరోనా సమయంలో పేదల ప్రాణాలకోసం సీఎం జగన్ పరితపించారు.
నాలుగేళ్లలో ప్రభుత్వం 2,300 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గానికి ఖర్చు చేశారు. త్వరలోనే సీఎం జగన్ రూ.1600 కోట్లతో వరికశిల పూడి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ ఆదేశాలతో బడుగు బలహీనర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాం’ అని తెలిపారు
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఎమ్మెల్యే పిన్నెల్లి.
ఎమ్మెల్సీ కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ‘ పల్నాడు గడ్డ వైసీపీ అడ్డ. చంద్రబాబు హయాంలో రాక్షస పాలన జరిగింది. మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. సమాజంలో అణచివేతకు గురైనవారిని పైకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. మాచర్లలో 50 వేలమంది గిరిజనులు ఉన్నారు. షెడ్యూల్ కులాలు, తెగలను చంద్రబాబు నీచంగా చూశారు. ఎస్సీల్లో ఎవరు పుట్టలనుకుంటారు.. గిరిజనులకు తెలివితేటలు ఉండవు అనే మాటలతో చంద్రబాబు హింసించారు. దేశంలో 3లక్షల 26 వేల ఎకరాల భూమిని ట్రైబల్స్ కు అటవీ చట్టాల ప్రకారం పంచిన వ్యక్తి సీఎం జగన్ ఒక్కరే. ట్రైబల్ మెడికల్ కాలేజ్, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ, ట్రైబల్ హాస్పిటల్ స్థాపించారు’ అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ అన్ని వర్గాల కోసం రాజ్యాంగం రాశారు. రాజ్యాధికారంలో అంతర్భాగం అయినప్పుడే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయి. కులగణన చేయాలని తీర్మానం చేశాం. బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్.
ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ..‘ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినపుడు నేను ఓడిపోయినా ప్రపంచప్రఖ్యాతి గాంచిన మిర్చియార్డు చైర్మన్‌గా వడ్డెర కులానికి చెందిన నన్ను నియమించారు. ఆ పదవిలో వుండగానే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబును దగ్గరగా చూశాను.. పేదకులాలకోసం ఒక్క పని కూడా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి.. చంద్రబాబు మాటలను నమ్మవద్దు’ అని తెలిపారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ పల్నాడు పౌరుషానికి ప్రతీక పిన్నెల్లిరామకృష్ణారెడ్డి.ప్రజల్లో ఉన్నారు కాబట్టే నాలుగుసార్లు గెలిపించారు. 2024లో మాచర్లలో, రాష్ట్రంలో వైసీపీ జెండా మరోసారి ఎగరబోతోంది. 2014నుండి 2019 వరకు జరిగిన చంద్రబాబు పాలనను, సీఎం జగన్ పాలనను బేరీజు వేసుకోవాలి.
డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా మాట్లాడుతూ.. ‘ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాల్లో సామాజిక సాధికారతను చేతల్లో చూపించిన వ్యక్తి సీఎం జగన్. సామాజిక న్యాయమే జగన్ విధానం. చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా మైనార్టీని నియమించడం ఒక చరిత్ర. మైనార్టీల సంక్షేమంలో కోసం చంద్రబాబు రూ.2600 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రూ.23వేల 176 కోట్లు ఖర్చు చేశారు. సామాన్యులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండండి. ప్రతిపక్షాలు ఒక్క జగన్ ని ఎదుర్కోవడానికి కలిసిపోయాయి’ అని పేర్కొన్నారు.
ఎంపీ కృష్ణ దేవరాయులు మాట్లాడుతూ.. ‘ 2019లో అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ముందు రెండు దారులు ఉన్నాయి. మేనిఫెస్టోను వెబ్‌సైట్‌నుండి తొలగించి మాట తప్పడం ఒక దారి.. ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి విపత్తు వచ్చినా ప్రతీ హామీని నిలబెట్టుకోవడం మరో దారి. సీఎం జగన్ ఏ దారి ఎన్నుకున్నారో మీరే ఆలోచించుకోవాలి. గెలిచిన తర్వాత నాలుగున్నరేళ్ళపాటు ప్రజల్లోనే ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు అధికారం ఇస్తే పెత్తనం చేశారు. కొడుకుకు, మనుమడికి దోచి పెట్టారు. చంద్రబాబు ఆధారాలతో దొరికాక కూడా నిజం గెలవాలి అంటున్నారు. చంద్రబాబు రోగాలతో బయటకు వచ్చారు. బాలకృష్ణ చంద్రబాబును టచ్ చేయమంటున్నారు. చంద్రబాబును టచ్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎవరికీ లేదు. సీఎం జగన్ తాను నివాసం ఉంటున్న కొద్ది దూరంలోనే ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అమరావతిని అడ్డుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారు’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment