ప్రజా ప్రస్థానం పాదయాత్ర వాయిదా  | YSRTP Chief YS Sharmila To Take A Short Break From Padayatra | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రస్థానం పాదయాత్ర వాయిదా 

Nov 10 2021 2:38 PM | Updated on Nov 11 2021 1:18 PM

YSRTP Chief YS Sharmila To Take A Short Break From Padayatra - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే పాదయాత్ర పునఃప్రారంభమవుతుందన్నారు.

సాక్షి, నార్కట్‌పల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. కోడ్‌ ముగిసిన వెంటనే తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 21 రోజుల్లో సాగిన యాత్రలో ఆరు నియోజకవర్గాల్లోని 150 గ్రామాలను సందర్శించినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం గ్రామంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు మద్దతుగా తాను హైదరాబాద్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. రాష్టంలో సమస్యలే లేవని పాలకులు చెబుతున్నారని, కానీ తన పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలు వివరించారని, తాను కూడా కళ్లారా చూశానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి సమస్య పరిష్కరించేందుకు దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రాజెక్టులను ప్రారంభిస్తే నేటికీ వాటిని పూర్తి చేయకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయబోమని కేసీఆర్‌ ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ చూడాలని, అప్పుడే అందరి బతుకుల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే రైతులను ఆదుకుంటామని, నచ్చిన పంటలు సాగుచేసుకోవచ్చని, దానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు, రైతుల బ్యాంక్‌ రుణాల మాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement