
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం తెచ్చిన అప్పులు, ఖర్చు చేసిన మొత్తంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణను అభివృద్ధి చేయడంలో పోటీ పడాల్సిన కేసీఆర్ ప్రభుత్వం.. అప్పులు, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, మానవ అక్రమ రవాణాలో పోటీ పడుతోందని దుయ్యబట్టారు.
రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఎనిమిదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరిని ఉద్ధరించారు దొరా? అని ఆమె నిలదీశారు. గురువారం ట్విట్టర్ వేదికగా.. రెండేళ్లలోనే మీరు చేసిన లక్ష కోట్ల అప్పు ఎక్కడికి పోయిందని షర్మిల ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు దొర ఖజానా దాటి బయటకు రావు. రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏ ఇంటికైనా రూ.4 లక్షల ప్రయోజనం జరిగిందా?.. పోనీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారా? లేక రైతుల రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ అండ్ కో కోసం చేస్తున్న అప్పులు ప్రజల నెత్తిన గుదిబండగా మారాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment