పత్తి చేనులో కూలీలతో కలిసి పని చేస్తున్న షర్మిల
దేవరకద్ర/దేవరకద్ర రూరల్/అడ్డాకుల: పాలకులు మంచి వాళ్లయితేనే ప్రజాభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన పాలనతో ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్సార్ అని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రతిక్షణం పరితపించిన మహానేత వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకొచ్చేందుకు చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఈ రోజుతో 150 రోజులకు చేరుకుందని తెలిపారు.
సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకంపల్లి, వెంకటగిరి, కౌకుంట్ల, ఇస్రంపల్లి, అడ్డాకుల మండలం రాచాల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎంతో మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో నేడు కుటుంబపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని ఎద్దేవాచేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చని కేసీఆర్.. దేశాన్ని ఏలుతానని పగటి కలలు కంటున్నారని షర్మిల విమర్శించారు. తెలంగాణలో ప్రజల కోసం కోట్లాడే పార్టీ లేదన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రజలకు అందించడం కోసమే పార్టీని పెట్టానని అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. కాగా, పాదయాత్రలో భాగంగా వెంకటగిరి సమీపంలో పత్తి చేనులో పని చేస్తున్న కూలీలను షర్మిల పలకరించారు. పత్తి చేనులోకి వెళ్లి కూలీలతో కలిసి పత్తిని తుంచారు. ఈ సందర్భంగా పత్తికి గిట్టుబాటు ధర వస్తుందా? అని రైతులను అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment