పెదకూరపాడు: టీడీపీ నేత నారా లోకేశ్ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం నిర్వహించిన యువగళం పాదయాత్రలో ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాదయాత్ర లగడపాడు గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే.. రోడ్డు పక్కన ఉన్న ఎస్సీ కాలనీ వాసులు ఎప్పడో ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్‌సీపీ జెండాలను తొలగించాలంటూ ఆందోళనకు దిగారు.
కొందరు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చి ఆ జెండాలను తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. తాము ఏర్పాటు చేసుకున్న జెండాలను ఎందుకు తొలగించారంటూ టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. ఒక దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. అయినా టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఎస్సీ కాలనీ మహిళలు తమ ఇళ్లలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫొటోలు తెచ్చి.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు.
మా ఎస్సీలకు టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. దీంతో కొందరు టీడీపీ కార్యకర్తలు వాటర్ బాటిళ్లను మహిళలపైకి విసిరారు. ఆగ్రహించిన ఎస్సీ మహిళలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. రెండు వర్గాలకు మధ్య పోలీసులు నిలబడి సర్దిచెప్పారు. అటుగా వెళుతున్న లోకేశ్‌ను చూసి.. జై జగన్ అంటూ ఎస్సీ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment