విశాఖపట్నం, సాక్షి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైనాట్-175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. అందుకే పార్టీలో మార్పులని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అసంతృప్తులు పార్టీని వీడడం షరా మామూలుగా జరిగేదేనని అన్నారాయన. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో మీడియాతో వంశీకృష్ణా యాదవ్ పార్టీ మారిన సంగతిపైనా స్పందించారు.
ఎక్కడైతే మార్పు అవసరమని భావించామో అక్కడే ఇంఛార్జిలను మారుస్తున్నాం. ముందు పని చేసిన నాయకులు కొత్తవాళ్లకు సహకరించాలని సీఎం జగన్ కూడా చెప్పారు. ఎంతమంది ఉన్నా.. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకి(వంశీకృష్ణ యాదవ్‌ను ఉద్దేశించి..) ఎమ్మెల్సీ ఇప్పించాం. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలి. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా మాకు ఇబ్బందేం లేదు అని అన్నారాయన.
పవన్, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌కు తిరుగు లేదని, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే సీఎం అవుతారు అని సుబ్బారెడ్డి చెప్పారు.
అందుకే రాజధాని ఆలస్యం
న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని వైవీ సుబ్బారెడ్డి కుండబద్ధలు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment