![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/25.jpg.webp?itok=DQ_Cj18M)
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు – పేర్నమిట్ట మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒంగోలు క్విస్ కాలేజీలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి గొట్టిముక్కల నితిన్ శ్రీవర్మ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి కళ్లగుంట సుధీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులైన నితిన్ శ్రీవర్మ, సుధీర్ ఇద్దరూ క్విస్ కాలేజీలో ఫైనలియర్ బీటెక్ చదువుతున్నారు. స్వగ్రామం సంతనూతలపాడు మండలం మన్నంవారిపాలెం నుంచి బైకుపై కాలేజీకి వచ్చి వెళ్తుంటారు.
రోజూలాగే శుక్రవారం కూడా ఇద్దరూ సుధీర్ బైకుపై కాలేజీకి వెళ్తున్నారు. నితిన్ వెనుక కూర్చుని ఉండగా, పేర్నమిట్ట ఈనాడు ఆఫీస్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా రోడ్డు పక్కన గ్రానైట్ రాళ్లను ఒంగోలు వైపు తీసుకెళ్తున్న టిప్పర్ నిలిపి ఉంది. టిప్పర్ వెనుక టైర్లకు సుధీర్ కాళ్లు తగిలి రోడ్డుకు కుడివైపు పడ్డారు. అదే సమయంలో పొద్దుటూరు నుంచి హద్దురాళ్లను ఒంగోలు వైపు తీసుకెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై పడిన నితిన్ శ్రీవర్మ తలపైకి ఎక్కడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. సుధీర్‌కు కూడా తీవ్ర గాయాలవడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
నితిన్ శ్రీ వర్మ తండ్రి క్విస్ కాలేజీ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు మృతి చెందాడనే సమాచారం తెలియగానే నితిన్ తాత కోటమురాజు, తండ్రి సీతారామరాజు, తల్లి లక్ష్మి, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించిన తీరు అక్కడివాళ్లను సైతం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. క్విస్ కాలేజీ కరస్పాండెంట్ నిడమానూరి నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒంగోలు తాలూకా ఏఎస్సైలు షేక్ జిలాని, దయానందరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన సుధీర్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై జిలాని కేసు నమోదు చేశారు.
ప్రమాదాన్ని చూసి చలించిపోయిన మంత్రి సురేష్...
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు గెస్ట్‌హౌస్ ప్రారంభోత్సవానికి ఒంగోలు వెళ్తున్న పురపాలక శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్నమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి కాన్వాయ్ ఆపి పరిశీలించారు. నడిరోడ్డుపై నెత్తుటి మడుగులో నిర్జీవంగా పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసి చలించిపోయారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.
పోలీసు అధికారులతో మాట్లాడి త్వరితగతిన మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు రోడ్డు ప్రమాదంలో అర్ధంతరంగా తనువు చాలించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment