గూడులేని పేదల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ‘మహాయజ్ఞం’లా చేపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఒంగోలు నగరంలో పేదలందరికీ ఒకే డిజైన్ లో ఇళ్లు నిర్మించి శాటిలైట్ సిటీని రూపొందించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తలంచారు. దీనికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సైంధవుడిలా అడ్డుపడ్డారు.
తన అనుచరులతో న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. ఫలితంగా పేదలు సొంతగూడుకు దూరమయ్యారు. ఒక వైపు దేశం నేతల కుట్రలు ఎదుర్కొంటూనే మరో వైపు పేదలకు ఎలాగైనా గృహాలు నిర్మించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే బాలినేని అడుగులు వేశారు. దీనికి సీఎం నుంచి సానుకూలంగా స్పందన రావడం, భూముల కొనుగోలుకు రూ. 200 కోట్లు మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. నగర పరిసరాల్లో 508 ఎకరాల భూసేకరణ కూడా జరిగిపోయింది. ఇలా పచ్చ నేతలకు బాలినేని షాక్ ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా ఒకేచోట భారీ స్థాయిలో ప్రభుత్వ భూమిని సేకరించి నగరంలోని వేలాది మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. కొత్తగా ఒక శాటిలైట్ సిటీని నిర్మించాలని అనుకున్నారు. నగర శివారు యరజర్ల గ్రామంలో 818 ఎకరాలు సేకరించారు. దాదాపు 23,531 మందికి సొంత ఇంటి కల నిజం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
హద్దురాళ్లు కూడా వేయించారు. ఇది పచ్చనేతలకు కంటగింపుగా మారింది. ఇంతమంది నిరుపేదలకు ఇళ్లు ఇస్తే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి కుట్రలకు తెరతీశారు. తన ప్రధాన అనుచరుడైన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించారు. గతంలో ఈ స్థలాన్ని ఐరన్ ఓర్ మైనింగ్‌కు ఇచ్చారని హైకోర్టుకు వెళ్లాడు. దీంతో హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీనిపై పేదలు దామచర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ రాజకీయ భవిష్యత్‌కు మేము బలికావాలా అంటూ నిలదీస్తున్నారు. ఇళ్లులేని నిరుపేదలపై టీడీపీకి ఎందుకింత కక్ష అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
పేదల ఇళ్ల కోసం ఎందాకై నా అంటున్న బాలినేని...
టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరాలన్న దృఢ సంకల్పంతో బాలినేని శ్రీనివాస రెడ్డి అడుగులు ముందుకేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసైనా ఇళ్లు ఇద్దామని సీఎం భరోసా ఇచ్చారు. రైతుల వద్ద భూములు కొనుగోలు చేయటానికి రూ.200 కోట్లు విడుదల చేశారు.
దీంతో రెవెన్యూ అధికారులను రైతుల నుంచి భూములు కొనుగోలు చేసేందుకు బాలినేని పరుగులు పెట్టించారు. అగ్రహారం, వెంగముక్కల పాలెంలలో భూముల సర్వే చేపట్టారు. రైతుల వద్ద నుంచి 508 ఎకరాలు కొనుగోలు చేశారు. లే అవుట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇళ్లులేని నిరుపేదలు 23,531 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పుడా సంఖ్య 28 వేలమందికి చేరింది. అయినా సరే వెనక్కి తగ్గేదే లేదంటూ దరఖాస్తు చేసుకున్న అందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్లు కూడా నిర్మించాలన్న నిర్ణయంతో బాలినేని అడుగులు ముందుకేస్తున్నారు.
టీడీపీ అడ్డుకోవటం... పేదలకు మంచే జరిగింది:
యరజర్లలో శాటిలైట్ టౌన్‌షిప్ నిర్మించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని తలిస్తే దానిని పూర్తి కానీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు పేదలకు చెడుచేయాలని తలంచినా... అంతా మన మంచికే అన్న చందంగా నిరుపేదలకు ఇంకా మేలే జరిగింది. అక్కడి టౌన్‌షిప్ ఆగిపోవటంతో బాలినేని అగ్రహారం, వెంగముక్కల పాలెంలలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పూనుకున్నాడు.
దీంతో ఇప్పుడు ఇవ్వదలచుకున్న ప్లాట్లు ఇంకా ఒంగోలు నగర పరిధిలోనే కావటంతో సొంతింటి కల నెరవేరుతున్న నిరుపేదల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. పేదలకు సేవ చేయాలనే నాయకుడి సంకల్పం బలంగా ఉండాలే కానీ పేదలకు ఎప్పుడూ అన్యాయం జరగదు అని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది. బాలినేని శ్రీనివాస రెడ్డి సంకల్పం బలంగా ఉంది కాబట్టే ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా పట్టాలు ఇప్పిస్తా
ఒక్క ఎకరా కూడా ప్రైవేటు భూమి కొనుగోలు చేయకుండా ప్రభుత్వ భూమిలోనే పెద్ద ఎత్తున యరజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కూడా ఇంతపెద్ద ప్రభుత్వ స్థలం లేదని, ఒంగోలులోనే ఇది సాధ్యమైందని అందరూ భావించారు. అయితే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యరజర్లలో శాటిలైట్ టౌన్ షిప్‌ను మాజీ ఎమ్మెల్యే దామచర్ల అడ్డుకున్నాడు.
న్యాయపరమైన అడ్డంకులు సృష్టించాడు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి తీరుతాం. అందుకే అగ్రహారం, వెంగముక్కల పాలెంలలో 508 ఎకరాలు కొనుగోలు చేయించాం. ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది. త్వరలో లే అవుట్లు సిద్ధం చేయిస్తాం. సొంత ఇంటికల నెరవేర్చి నిరుపేదల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి లక్ష్యం. త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా పేదల పట్టాల పంపిణీ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం.
– బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment