![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/21/MLA-Balineni.jpg.webp?itok=LRoNc7Iq)
ఒంగోలు: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయరెడ్డితో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శుక్రవారం భేటీ అయ్యారు. ఒంగోలులో గత పది సంవత్సరాలకుపైగా జరుగుతున్న ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్‌ల కుంభకోణం అంశాలపై నిష్పాక్షిక దర్యాప్తు ద్వారా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా గురువారం సీఎంవోలో భేటీ అయిన అంశాలపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయని, అందుకు గల కారణం ఏమిటనేది కూడా విచారించాల్సిన అవసరాన్ని వివరించారు.
అయితే బాలినేని తెలియజేసిన అంశాలపై సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి తక్షణమే కలెక్టర్, ఎస్పీలను సీఎంవోకు పిలిపించుకుని ముగ్గురి సమక్షంలో చర్చించడం, అనంతరం ఒంగోలు నియోజకవర్గ ప్రజలు, నాయకులు బాలినేని భద్రతను దృష్టిలో ఉంచుకుని వెనక్కు పంపిన గన్‌మెన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎంవో అధికారులు సూచించడంతో బాలినేని అంగీకరించారు. అలాగే ఈ వ్యవహారాన్ని తొందరగా తేల్చాలని, అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించినట్టు తెలిసింది.
ఫేక్ డాక్యుమెంట్స్, భూ రిజిస్ట్రేషన్ వివాదాలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తీసుకెళ్లారు. ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో వాటన్నింటిపై విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రస్తావించారు. విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించగలుగుతామన్నారు. దీనిలో జరుగుతున్న జాప్యం వల్లే తాను మనస్తాపానికి గురయ్యానని, అందువల్లే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి సమస్యను తీసుకొచ్చామన్నారు.
ఒంగోలు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, వారిలో నెలకొన్న ఆందోళన తొలగించాలనే ఉద్దేశంతోనే కేవలం పోలీసు డిపార్టుమెంట్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వారి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకుపోయేందుకు గన్‌మన్లను వెనక్కు పంపినట్లు పేర్కొన్నారు. దీనిపై ధనుంజయరెడ్డి కలెక్టర్‌తో, ఎస్పీతో చర్చించారు. విచారణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు అవసరమైతే సీఐడీ సహకారం కూడా తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించారు.
శుక్ర, శనివారాల్లో సీఎంవో అధికారులతో బాలినేని భేటీ అంశాలపై మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలను సీఎంవో కార్యాలయం కూడా ఖండిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అంతే కాకుండా తప్పుడు కథనాల అంశాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, దానిపై ఆయన ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించినట్లు సీఎంవో అధికారులు బాలినేనికి వివరించారు. అదే విధంగా ఒంగోలులో సుమారు 25 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించి అతి త్వరలోనే నిధులు విడుదలచేసి పట్టాల పంపిణీ చేస్తారని తెలిపారు.
ఒంగోలులో ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి సరఫరా స్కీము టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడానికి ఉన్న జాప్యాన్ని కూడా సీఎంవో కార్యాలయం దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు బాలినేనికి స్పష్టం చేశారు. కొత్తపట్నం బకింగ్‌హాంపై కెనాల్‌పై జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి, ఆర్యవైశ్య ఆరామక్షేత్రం పనులు గురించి చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment