నాకు నా ఇద్దరు పిల్లలు కావాలి... వారు లేనిదే నేను ఉండలేను | - | Sakshi
Sakshi News home page

నాకు నా ఇద్దరు పిల్లలు కావాలి... వారు లేనిదే నేను ఉండలేను

Published Sun, Dec 24 2023 1:44 AM | Last Updated on Sun, Dec 24 2023 2:09 PM

- - Sakshi

త్రిపురాంతకం: పెద్దారవీడు మండల పరిధిలోని దేవరాజుగట్టు వద్ద శుక్రవారం కారు– ఆటో ఢీ కొట్టుకున్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో మండలానికి చెందిన అన్నదమ్ములిద్దరూ క్రిస్మస్‌ పండుగకు దుస్తులు కొనుగోలు చేసేందుకు మార్కాపురం బయలు దేరి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరి మృతదేహాలను స్వగ్రామం దూపాడు తీసుకు రాగా ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మారుమోగింది. దూపాడు గ్రామానికి చెందిన అభినయ్‌ ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, సోదరుడు రత్నతేజను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి వరకు తమ ముందు ఆటలాడుతూ కనిపించిన చిన్నారులు ఇకలేరని తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎనిబెర పెద్ద లాజరు, ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. అభినయ్‌ రాజంపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతుండగా, తమ్మడు రత్నతేజ మార్కాపురం ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. క్రిస్మస్‌ పండగను ఆనందంగా జరుపుకునేందుకు స్వగృహం వద్ద అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పిల్లలకు దుస్తులు కొనుగోలు కోసం రావాల్సిందిగా చెప్పిన లాజరు ముందుగా మార్కాపురం వెళ్లాడు. అయితే పిల్లలు ఇద్దరూ కుంట వరకు వచ్చి మరో ఆటోలో మార్కాపురం బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు. అప్పటికే అభినయ్‌ మృతి చెందాడని, రత్నతేజ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అన్న కోసం ఆరాటపడటం చూసి వారు భోరున విలపించారు. హుటాహుటిన వైద్యశాలకు తరలించినా ఫలితం దక్కలేదు.

కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ నాసర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ ఎనిబెర శైలజ వారి వెన్నంటే ఉండి కుటుంబానికి అండగా నిలిచారు. పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తహసీల్దార్‌ వి. కిరణ్‌, ఎంపీడీఓ సాంబశివరావు, ఎంఈఓలు కె. తులసిమల్లికార్జున నాయక్‌, టి. రాజశేఖరరెడ్డి ఉన్నారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డితో మాట్లాడి శవ పంచనామా పూర్తి చేయించారు. సూపరింటెండెంట్‌ సుబ్బారెడ్డి, పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ చూపారు.

కుటుంబ సభ్యులు
మార్కాపురం: ‘నాకు నా ఇద్దరు పిల్లలు కావాలి... వారు లేనిదే నేను ఉండలేను. వారిని బతికించేందుకు నా గుండెను తీసి పెట్టండయ్యా’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అభినయ్‌, రత్నతేజ తల్లి ఉమ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ‘నా పిల్లలకు టిఫిన్‌ పెట్టనిదే నేను తినను. వారితోనే నా జీవితం’ అంటూ పోస్టుమార్టం రూంలో విగత జీవులుగా పడి ఉన్న కుమారులను చూసి తండ్రి లాజరుతోపాటు తల్లి ఉమ తల్లడిల్లిపోయింది. ‘వారికోసమే మేమిద్దరం బతుకుతున్నాం. స్కూల్‌ నుంచి వస్తే ఇంటిలో నా వెంటే తిరుగుతారు. ఏ మాత్రం గోలచేయరు. చెప్పిన మాట వింటారు. నేనెవరికోసం బతకాలయ్యా’ అంటూ దుఃఖిస్తున్న కన్నవారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. శనివారం ఉదయం మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో వైద్యశాల మిన్నంటింది.

ఆదుకుంటాం
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
యర్రగొండపాలెం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది హృదయ విదారక సంఘటన అని తెలిపారు. మృతుల కుటుంబాలను త్వరలోనే తాను కలిసి పరామర్శిస్తానని, వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. దేవుడు ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానంటూ సంతాపం ప్రకటించారు.

గృహ ప్రవేశానికి హాజరై తిరిగి వెళుతుండగా..
కొమరోలు: తమ దాయాది గృహ ప్రవేశానికి హాజరై వేడుకల్లో ఆనందంగా గడిపిన కుటుంబం రహదారి ప్రమాద రూపంలో రెండు నిండు ప్రాణాలను బలికొంది. కొమరోలు మండలం వర్ధనపల్లి గ్రామానికి చెందిన రాయి వెంకటేశ్వర్లు (62), రాయి నాగేశ్వరరావు (55) 40 సంవత్సరాల క్రితం గుంటూరులో వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. శుక్రవారం దాయాది రాయి చిన్న వెంకటేశ్వర్లు గృహ ప్రవేశం జరిగిన నేపథ్యంలో తన సోదరులను ఆహ్వానించాడు. ఈనేపథ్యంలో కొమరోలులో గృహ ప్రవేశానికి శుక్రవారం ఉదయం వీరిరువురు హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు బంధుమిత్రులతో సరదాగా, ఆనందంగా గడిపిన ఇరు కుటుంబాలు భోజనం చేసిన అనంతరం గుంటూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు, ఆటో ఎదురుగా ఢీకొనడంతో ఇరువురు సోదరులు అక్కడికక్కడే మృతి చెందారు. రాయి నాగేశ్వరరావు కుమారుడు నారాయణ 3 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. రహదారి ప్రమాదంలో ఇరువురు మృత్యువాత పడటంతో వర్ధనపల్లె గ్రామంలో కొమరోలులో విషాదఛాయలు అలముకున్నాయి.

విగతజీవిగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి
ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందిన ఉప్పలపాటి డానియేల్‌ స్వగ్రామం పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆటోలో వస్తూ తీవ్ర గాయాలు కాగా జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడటంతో భార్య మోహన కుప్పకూలిపోయింది, కుమారుడు రెండేళ్ల డానియేల్‌ పరిస్థితి ఏమిటంటూ కుమిలిపోయింది. తీవ్రంగా గాయపడిన అగ్రికల్చర్‌ విద్యార్థినులు మైధిలి, ముషీదా, కమ్రాన్‌లు కర్నూల్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement