పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
కొండపి: పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. మండలంలోని జార్లపాలెంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికులు, విద్యార్థులతో కలిసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు. అనంతరం ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇంకుడుగుంతల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఇంకుడు గుంతలను నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ క్రమంలో మన జిల్లాలో కూడా సుమారు 15 వేల ఇంకుడు గుంతలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. జార్లపాలెం గ్రామంలో 150 ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఇంకుడుగుంతల ఆవశ్యకతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్ద ప్రజలు వేరు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు చేయకుండా కనీసం ప్రతి ఆడబిడ్డ డిగ్రీ చదివేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత పనుల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి, కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. మంత్రి, కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. రెండు డ్వాక్రా సంఘాలకు రూ.3 లక్షల చొప్పున మంజూరైన రుణాలను సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి, కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.లక్ష్మీ ప్రసన్న, డీపీవో వెంకట నాయుడు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జెడ్పీ సీఈఓ బి.చిరంజీవి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్.ఈ.బాల శంకర్ రావు, డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ, స్థానిక మండల అభివృద్ధి అధికారి రామాంజనేయులు, తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాలో 15 వేల ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యం మంత్రి స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment