
అర్జీలు సత్వరమే పరిష్కరించేలా చర్యలు
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
ఒంగోలు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 243 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధపెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలన్నారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులను చూడాలని, అలాగే వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారం చూపుతూ రీ ఓపెన్ కేసులు రాకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చినఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, పార్ధసారధి, వరకుమార్, విజయజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనులను కాంట్రాక్టర్ లకు ఇవ్వకూడదన్న హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని జేసీకి వైఎస్సార్‌సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవికుమార్ యాదవ్, బేస్తవారిపేట జెడ్పీటీసీ బండ్లమూడి వెంకటరాజు, రావిపాటి రమేష్‌రెడ్డి, మైనారిటీ నాయకులు నాసర్‌వలి, కాశీ విశ్వనాథ్, బోయపాటి రామకృష్ణ, ఏడుకొండలు వినతిపత్రం అందించారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
ఒంగోలు టౌన్: రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల దినంలో ఐద్వా ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ల అనుకూల విధానాల ఫలితంగానే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిరుపేద మధ్యతరగతి ప్రజల జీవితాలపై పెనుభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే దాని ప్రభావం కుటుంబంలో మహిళపైనే పడుతుందన్నారు. ఆదాయాలు, నిత్యావసర వస్తువుల ధరలకు పొంతన లేకుండా పోవడంతో ప్రజలు అర్ధాకలితో అలమటించే రోజులు దాపురించాయని చెప్పారు. దీంతో సరైన పోషకాహారం లేక మహిళలు, చిన్నారుల ఆరోగ్యం దెబ్బ తింటుందని, రక్తహీనత, గర్భకోశ వ్యాధులు, కాల్షియంతో ఎదుగుదల లోపాలతో అల్లాడిపోతున్నారన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని, కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు బి.గోవిందమ్మ, నాయకురాళ్లు రాజేశ్వరి, పెద గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment