ప్రైవేటుకు రా బడి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు రా బడి

Published Tue, Feb 18 2025 1:46 AM | Last Updated on Tue, Feb 18 2025 1:46 AM

ప్రైవ

ప్రైవేటుకు రా బడి

● వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులు పెంచేందుకు కార్పొరేట్‌ స్కూళ్ల సన్నద్ధం ● ప్రస్తుతం ఎల్‌కేజీకే ఫీజు రూ.30 వేలు వసూలు ● అదనంగా బుక్స్‌కి మరో రూ.6 వేలు వసూలు చేస్తున్న వైనం ● వచ్చే ఏడాది నుంచి ఫీజులో 15 శాతం నుంచి 40 శాతం పెంచేలా యాజమాన్యాలు ● ప్రభుత్వ విద్య అంటే పట్టని చంద్రబాబు ● జిల్లాలో 545 ప్రైవేట్‌ పాఠశాలలు..
ప్రభుత్వం చతికిల బడి..

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల పేరిట అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. ఫీజులను భారీగా పెంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై భారం మోపనున్నాయి. ప్లేస్కూల్‌, ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. డిమాండ్‌ను బట్టి ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ఫీజులకు అదనంగా 25 శాతం నుంచి 40 వరకూ పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన కూటమి

కూటమి ప్రభుత్వం సర్కార్‌ స్కూళ్లను పట్టించుకోవడం మానేసింది. నాడు–నేడు పనులను నిలిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా ఒక్క తరగతి గది కూడా నిర్మించలేదు. ఫలితంగా పలు స్కూళ్లలో సరిపడా గదుల్లేకి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌లు పనిచేయడంలేదు. సరైన మౌలిక వసతుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల ముందు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ నీకు..రూ.15,000, నీకు రూ.15,000, నీకు రూ.15,000 అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు. ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ వాయిదాలు వేస్తూ వస్తోంది. వైఎస్సార్‌ హయాంలో నాలుగు విడతలు అమ్మఒడి కింద రూ.1357,83,15,000 తల్లుల ఖాతాలో జమచేసింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చతికిలపడింది.

ఒంగోలు సిటీ:

ప్రైవేట్‌ విద్యా సంస్థల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. యాజమాన్యాలు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు 551 ఉన్నాయి. వీటిల్లో 1,27,768 మంది విద్యార్థులు చదువుతున్నారు. 176 ప్రైమరీ స్కూళ్లలో 38,305 మంది విద్యార్థులు, 132 యూపీ స్కూల్స్‌లో 19,900 మంది, 237 హైస్కూల్స్‌లో 66,240 మంది, సీబీఎస్‌ఈ సిలబస్‌తో 4 హైస్కూల్స్‌లో 2,121 మంది, ఐసీఎస్‌ఈ సిలబస్‌ తో 2 హైస్కూల్స్‌లో 1,202 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఫీజుల భారం..

ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో తమ పిల్లల్ని చదివించాలంటే సామాన్య, మధ్య తగరతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేట్‌ స్కూళ్లకు ముకుతాడు వేశారు. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ గాడితప్పింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇస్టానుసారంగా ఫీజులు పెంచేశాయి. ఒంగోలు నగరంలోని కార్పొరేట్‌ స్కూలులో ఎల్‌కేజీకి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. హైస్కూలు అయితే 6వ తరగతి వరకూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ ఉన్నాయి. కొన్ని పెద్ద విద్యా సంస్థలైతే రూ.లక్షన్నర వరకూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

ప్రాంతాల వారీగా ఫీజులు

నగరంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. మార్కాపురం, దర్శి, చీమకుర్తి, కనిగిరి, పొదిలి పట్టణాల్లో స్కూళ్లల్లో ఫీజులు ఒంగోలు నగరంలో మాదిరిగా ఉన్నాయి. మిగతా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫీజుల వ్యత్యాసం స్వల్పం. ఇక పుస్తకాల పేరుతో అదనంగా రూ.6,500 నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నాయి.

ట్యాబ్‌ల పంపిణీ..

డిజిటల్‌ విద్యలో భాగంగా విద్యార్థులకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. బైజూస్‌, టోఫెల్‌ కంటెంట్‌తో 8 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు ట్యాబులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 21,617 మంది విద్యార్థుల్లో 20,436 మందికి ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో సర్కార్‌ స్కూళ్లకు వైభవం..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సర్కార్‌ స్కూళ్లకు మహర్దశ పట్టింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్‌ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించారు. అలాగే ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌సీ సిలబస్‌ను అమలు చేశారు. సరిగ్గా స్కూలు తెరిచే సమయానికి ముందు ‘‘జగనన్న విద్యా కానుక’’ కింద పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూస్‌, బెల్ట్‌, టైలు, ఇంగ్లిష్‌ డిక్షనరీలు అందజేశారు. అలాగే అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేశారు. అలాగే డిజిటల్‌ విద్యను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేశారు.

ఫీజు నియంత్రణ చట్టం ఏది?

ఫీజు నియంత్రణ చట్ట ప్రకారం నిర్ణయించిన ఫీజులను నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రకటించాలి. దీనిని కార్పొరేట్‌ విద్యాసంస్థలు పాటించడం లేదు. పుస్తకాలు, దుస్తులు సైతం స్కూల్‌ లోనే కొనాలని నిబంధన పెట్టి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్‌ వంటి పేర్లను ఉపయోగించకూడదు. అయినా కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారు.

– సీహెచ్‌ వినోద్‌, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రైవేటుకు రా బడి1
1/2

ప్రైవేటుకు రా బడి

ప్రైవేటుకు రా బడి2
2/2

ప్రైవేటుకు రా బడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement