
జీబీఎస్ అంటువ్యాధి కాదు
● డీఎంహెచ్‌వో టి.వెంకటేశ్వర్లు
కొమరోలు: జీబీఎస్ అంటు వ్యాధి కాదని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి టి.వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని అలసందలపల్లె గ్రామంలో జీబీఎస్ వైరస్‌తో కమలమ్మ ఆదివారం మృతువాత పడిన విషయం తెలిసిందే. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టి.వెంకటేశ్వర్లు సోమవారం అలసందలపల్లె గ్రామాన్ని సందర్శించారు. కమలమ్మ ఇంటికి వెళ్లి కమలమ్మ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీబీఎస్ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకదని, ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి వ్యాపించదని తెలిపారు. కండరాల బలహీనత, జ్వరం, కాళ్లనొప్పులు, విరేచనాలు వంటివి ఉంటే సమీప ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించాలని, ఎక్కువ రోజులు ఆ వ్యాధులతో బాధపడుతూ ఉండవద్దని ప్రజలకు సూచించారు. దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్న వారికి తప్పించి జీబీఎస్ వైరస్ సోకితే నూటికి నూరు శాతం రికవరీ అవుతారని తెలిపారు. ప్రజల్లో ఉన్న భయాన్ని విడనాడేలా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఈ వైరస్ సోకుతుందన్నారు. రాజుపాలెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రజియత్‌భాను సోమవారం కూడా గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.పద్మావతి, ఎంపీడీవో మస్తాన్‌వలి, మండల విస్తరణాధికారి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి రమణ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment