
వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి
● ముస్లిం ప్రజా సంఘాల నిరసన
ఒంగోలు వన్‌టౌన్: వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లిం ప్రజా సంఘాలు సోమవారం నిరసన వ్యక్తం చేశాయి. ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ సమీపంలోని మౌలానా అబుల్ కలాం అజాద్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ చట్టం సవరణపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నా చట్టాన్ని ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఏపీ ప్రభుత్వం చట్టాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ముస్లింలకు పెద్దన్నగా ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ముస్లింల మనోభావాలను గౌరవించి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం సమాజానికి అండగా నిలబడాలన్నారు. నిరసన కార్యక్రమంలో ముస్లిం సంఘాల ఐక్యవేదిక, ఆవాజ్, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి సమితి, ముస్లిం సంక్షేమ సంఘం తదితర సంఘాల నాయకులు పఠాన్ కరిమూల్లా ఖాన్, సయ్యద్ ఇస్మాయిల్, ఎస్‌కే మహ్మద్ రఫీ, సయ్యద్ హుస్సేన్, కరీముల్లా, ఎస్‌కె అమిర్, మహ్మద్ ఆషిక్, పఠాన్ మసూద్ ఖాన్, పఠాన్ రహమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఏకేయూలో ఎంపీఈడీ పుస్తకావిష్కరణ
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.పి.ఎడ్) చేస్తున్న విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టరు ఐ.దేవీ వరప్రసాద్ రచించిన ‘అడ్వాన్సింగ్ ఫిజియాలజీ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్’ పుస్తకాన్ని వీసీ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పుస్తకం విద్యార్థులకు కోర్సు పరంగానే కాకుండా ఇతరత్రా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠ్యాంశాలను సులభశైలిలో అర్థం చేసుకొని విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు తయారు కావడానికి ఉపకరిస్తుందన్నారు. పుస్తక రచయిత దేవీవరప్రసాద్ వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యాపకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment