ఇష్టారాజ్యంగా లారీల నిర్బంధం ...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఇసుక మాఫియా రోజురోజుకూ మరింత రెచ్చిపోతోందని టిప్పర్ యజమానులు ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 5వ తేదీ నెల్లూరు నుంచి బిల్లులతో వస్తున్న ఇసుక లారీని కిమ్స్ హాస్పిటల్ వద్ద మూడు రోజుల పాటు ఆపేసి లారీ యజమానిని ఇబ్బందులకు గురిచేసినట్టు సమాచారం. ఈ ఏడాది జనవరి 28వ తేదీ కూడా ఒక టిప్పర్‌ను ఆపి డ్రైవర్‌ను చితకబాది లారీ అద్దాలను పగులగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఊరుకోకుండా లారీని తీసుకెళ్లి యార్డులో మూడు రోజులపాటు నిర్బంధించినట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టిప్పర్ యజమాని ఆకుల మోహన్‌రావు తెలిపారు. ఫిబ్రవరి 23వ తేదీ దర్శిలో మరోలారీపై ఇసుక మాఫియా దాడి చేసి అద్దాలు పగులగొట్టింది. దర్శి ఇసుక యార్డుకు సంబంధించిన 15 మంది ప్రైవేటు సైన్యం బిల్లులతో వస్తున్న లారీని అడ్డుకుని విధ్వంసం సృష్టించారు. లారీ అద్దాలను పగులగొట్టడమే కాకుండా టైర్లను కత్తితో కోసేశారు. లారీ డ్రైవర్‌ను క్రూరంగా హింసించారు. ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా, అక్కడకు కూడా వచ్చిన ప్రైవేటు సైన్యం ఎస్‌ఐ ముందే దాడి చేస్తామని బెదిరింపులకు దిగడం గమనార్హం. ఫిబ్రవరి 24వ తేదీ పెద్దారవీడు మండంలోని దేవరాజుగట్టు వద్ద ఇసుక మాఫియా లారీని ఆపి రచ్చ చేసినట్లు సమాచారం. ఈ ప్రభుత్వం మాది, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకోమంటూ సవాల్ విసరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసేదేమీ లేక టన్నుకు రూ.250 చొప్పున కప్పం కట్టి లారీని విడిపించుకున్నట్లు తెలిసింది. గత మూడు నెలల్లో ఇలాంటి ఘటనలు సుమారు 15 నుంచి 20కిపైగా ఉన్నట్లు సమాచారం. దీంతో లారీ డ్రైవర్లు డ్యూటీలకు వెళ్లాలంటేనే ప్రాణభయంతో వణికిపోతున్నారు. లారీ యజమానులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని టిప్పర్ల అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment