బాలికల హక్కులను పరిరక్షించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: బాలికలు స్వేచ్ఛగా ఎదిగేలా వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఒంగోలులోని ప్రభుత్వ ఆస్పత్రి (రిమ్స్) నుంచి నెల్లూరు బస్టాండ్ సెంటర్ వరకూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ‘బాల్యవివాహాల రహిత ప్రకాశం జిల్లా’ ఆవిష్కరణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ క్యాండిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. కనీసం 18 ఏళ్లు నిండే వరకూ ఆడపిల్లలకు వివాహం చేయకుండా వారిని చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్యవివాహం చేసుకోబోనని ప్రతి ఆడపిల్ల కూడా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల ఆరోగ్యం, హక్కులను కాపాడేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, సీడీపీవోలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment