
ప్రావిడెంట్ ఫండ్‌ను వెంటనే ఇప్పించాలి
ఒంగోలు టౌన్: రాష్ట్ర పౌరసరఫరా సంస్థలో హమాలీలుగా పనిచేసి చనిపోయిన, రిటైర్డ్ అయిన, మానుకున్న వారికి సంబంధించిన ప్రావిడెండ్ ఫండ్ ను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. మంగళవారం సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటి వరకు మరణించిన 9 మంది కార్మికుల కుటుంబాలకు పీఎఫ్, పెన్షన్ ఇప్పించడంలో అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో హమాలీలు శ్రీనివాసరెడ్డి, శేషయ్య, సుబ్బారావు, నాగరాజు, వెంకటేశ్వరరెడ్డి, శ్రీను, రంగయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
బంగారు బాల్యానికి స్కోచ్ అవార్డు
ఒంగోలు సిటీ: జిల్లాలో బాల్యవివాహాలను నివారించి బంగారు బాల్యానికి బాటలు వేసేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాల్లో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండటంతో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏ.తమీమ్ అన్సారియా సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాములను చేస్తూ ‘బంగారు బాల్యం’ కార్యక్రమాన్ని రూపొందించారు. త్వరలోనే న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. అవార్డు సాధించిన కలెక్టర్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment