చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
పొన్నలూరు: చేపల వేటకి వెళ్లిన యువకుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు.. నూకతోటి నాగేశ్వరరావు, పోలమ్మ దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. మూడో కుమారుడు చిరంజీవి(18) పుట్టుకతోనే మూగ, చెవిటి కావడంతో చదువు మానేసి గ్రామంలో పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో చేపలు పట్టడానికి వెళ్తున్నట్లు తల్లికి సైగల ద్వారా చెప్పి గ్రామానికి ఉత్తరం వైపు ఉన్న మాలోల్ల వాగు దగ్గరకు వెళ్లాడు. కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి కుమారుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల విచారించింది. బంధువుల సాయంతో టార్చి లైట్ల వెలుగులో మాలోల్ల వాగు పరిసరాల్లో వెతికినా జాడ కనిపించలేదు. పక్కనే ఉన్న యర్రగుంట వాగులో వెతకగా చిరంజీవి విగతజీవిగా నీటిపై తేలియాడుతూ కనిపించాడు. అప్పటికే చీకటి పడి పొద్దుపోవడంతో మృతదేహాన్ని వెలికితీయలేదు. గురువారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై అనూక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
వల ఒకచోట... మృతదేహాం మరో చోట
చిరంజీవి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టడానికి వేసిన వల, అతని చెప్పులు, దుస్తులు మాల్లోల వాగు వద్ద ఉండగా.. చిరంజీవి మృతదేహాం మాత్రం ఈ వాగుకు సుమారు 100 అడుగుల దూరంలో ఉన్న యర్రగుంట వాగులో బయటపడటం అనుమానాలకు కారణమైంది. చిరంజీవి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించాడా.. లేక చంపి పడేశారా? అనే చర్చ నడుస్తోంది. దివ్యాంగుడైన చిరంజీవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
వాగులో తవ్విన గుంతలో పడి యువకుడు మృతి
పొన్నలూరు మండలం చెన్నిపాడులో సంఘటన
Comments
Please login to add a commentAdd a comment