సామాజిక పింఛన్లు ఇంకా పీకేద్దాం!
ఒంగోలు జీజీహెచ్‌లో
సదరం సర్టిఫికెట్ల
వెరిఫికేషన్‌కు వచ్చి వేచి ఉన్న విభిన్న
ప్రతిభావంతులు
ఒంగోలు వన్‌టౌన్:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా అర్హులైన ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదు. కానీ ఎక్కడికక్కడ వడపోత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పింఛన్లు పీకేయడమే లక్ష్యంగా సదరం సర్టిఫికెట్లు, ఆరోగ్య పరిస్థితి తనిఖీ పేరుతో క్యాంపులు నిర్వహించడంపై దుమారం రేగుతోంది. పింఛను సొమ్ము పెంచామని గొప్పలు చెబుతూనే.. వెరిఫికేషన్ పేరుతో ఆర్థిక ఆసరాను నిలిపివేస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. కొత్త పెన్షన్లు ఇవ్వకపొగా ఉన్న వాటినీ ఎత్తేస్తున్నారని పలువురు లబ్ధిదారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా పింఛన్లను పరిశీలించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం.. సాకులు చూపుతూ కత్తెర వేస్తుండటం గమనార్హం. వెరిఫికేషన్‌కు రావాలని సరైన సమాచారం ఇవ్వకుండానే, క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నట్లుగా నమోదు చేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని చక్కదిద్దుకునేందుకు అవకాశం కల్పించకపోగా.. అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకోవడం లేదని పింఛను లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
50 ఏళ్లకే పింఛను పేరుతో కూటమి వంచన
కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సీఎం చంద్రబాబునాయుడు ఈ హామీపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 50 ఏళ్లు నిండిన వారు సుమారు లక్ష మంది వరకు పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ, డీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అడ్డగోలుగా పింఛన్ల నిలిపివేత
ఒక్క ఫిబ్రవరి నెలలోనే సీకేడీ(క్రానిక్ కిడ్నీ డిసీజ్) పింఛన్లు 415 నిలిపివేశారు. చిరునామాలు లేవని, వెరిఫికేషన్‌కు రాలేదని కారణంగా చూపారు. వాస్తవానికి సీకేడీ పింఛనుదారులు మంచానికే పరిమతమయ్యారా లేదా అని పరిశీలించి, వేలిముద్రలు, ఫొటోలతో సహా యాప్‌లో నమోదు చేయాలని మార్గదర్శకాలు ఉన్నా అటువంటివి ఏమీ చేయకుండానే పింఛను నిలిపివేయడం పాలకుల తీరుకు అద్దం పడుతోంది. అదే విధంగా రూ.15 వేలు పింఛను పొందుతున్న పక్షవాతం బాధితులు, మరొకరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకోలేని వారి పింఛన్లను కుడా పరిశీలన పేరుతో పీకేశారు.
దివ్యాంగులకు జెల్ల కొట్టేందుకు స్కెచ్
దివ్యాంగుల పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు జిల్లాలోని 33184 మంది దివ్యాంగుల సర్టిఫికెట్లను తనిఖీ చేస్తున్నారు. అంగవైకల్యంతో బాధపడుతూ రూ.6 వేలు పెన్షన్ తీసుకుంటున్న వారి వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీనికిగాను చీమకుర్తి, కొండపి, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నియమించిన వైద్యులు కాకుండా ఇతర వైద్యులతో ధ్రువపత్రాల పరిశీలన చేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు జీజీహెచ్‌లో ఇతర విభాగాలకు చెందిన వైద్యులు కూడా దివ్యాంగులను పరిశీలించి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.
కొత్త పింఛన్లు గగనమే..
జనవరి నుంచి నూతన పింఛన్లు అందిస్తామని సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత ఏడాది నవంబర్‌లో ప్రకటించారు. జనవరి తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి నూతన పింఛన్లు పంపిణీ చేస్తామని అర్భాటం చేశారు. ప్రస్తుతం మార్చి నెల ముగుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వ పెన్షన్ పోర్టల్ ప్రారంభించలేదు. గతంలోనే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న ఒక్కరికీ పింఛను మంజూరు చేయలేదు. వెరిఫికేషన్ పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తుండటంతో అర్హులందరూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరిలో జిల్లాలో 17 రకాల పింఛనుదారులు మొత్తం 2,85438 మంది ఉండగా.. మార్చి నెలలో ఆ సంఖ్య 2,83854కు పడిపోయింది. అంటే 1584 మందిని పింఛను జాబితా నుంచి తొలగించారు. సదరం వెరిఫికేషన్ మరో పది రోజులపాటూ కొనసాగనుందని సమాచారం.
పెన్షన్ల తనిఖీ వెనుక ఏరివేతలే లక్ష్యం
ఇప్పుడు దివ్యాంగుల వంతు..
సదరం వెరిఫికేషన్ క్యాంపుల్లో పడిగాపులు
నూతన పెన్షన్ల మంజూరుపై 10 నెలలుగా దాటవేత ధోరణి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే
పింఛను ఇస్తామని వంచన
‘వెఎస్సార్ సీపీ హయాంలో వారికి పింఛన్లు మంజూరయ్యాయి. అంటే వారంతా ఆ పార్టీ సానుభూతిపరులే. పింఛన్లు పీకేస్తే అంతా దారికొస్తారు. అర్హత ఉన్నా సరే అనర్హత వేటు వేస్తే సరి. కొత్త పింఛన్ల సంగతి తర్వాత చూద్దాం’ కూటమి ప్రభుత్వ పాలకుల తీరు అచ్చు ఇలాగే ఉంది. సామాజిక పింఛన్ల తనిఖీ పేరుతో కూటమి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు ఆర్థిక భరోసా
కోల్పోతున్నారు.
పింఛన్లు తొలగించడం సరికాదు
తనిఖీ పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదు. సదరం వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఎటువంటి కారణం చూపకుండా పింఛన్లు ఆపేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా గమనిస్తున్నాం. అవసరమైతే జిల్లాలో దివ్యాంగులతో కలిసి ఉద్యమం చేపడతాం.
– దొంతిరెడ్డి గోపాలరెడ్డి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు
సామాజిక పింఛన్లు ఇంకా పీకేద్దాం!
సామాజిక పింఛన్లు ఇంకా పీకేద్దాం!
Comments
Please login to add a commentAdd a comment