మద్యానికి బానిసలై.. అన్నదాతలను క్షోభ పెట్టి..
సింగరాయకొండ: మద్యం వ్యసనానికి బానిసలై, డబ్బు కోసం దొంగలుగా మారి పొలాల్లో డీజిల్ ఇంజన్లు, సోలార్ ప్లేట్లు చోరీ చేస్తున్న దొంగలు ముగ్గురిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల నుంచి రూ.85 వేల నగదు, డిజిల్ ఇంజన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ హజరత్తయ్య వెల్లడించారు. టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామానికి చెందిన గౌతుకట్ల అశోక్, పొన్నూరి రాంబాబు, పాటిబండ్ల శ్రీకాంత్ మద్యానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో డబ్బు కోసం టంగుటూరు, సంతనూతలపాడు మండలాల పరిధిలోని పొలాల్లో చోరీలకు పాల్పడేవారు. గత ఏడాది ఫిబ్రవరిలో కందులూరు, ఎర్రజర్ల గ్రామాల మధ్య పొలాల్లో పైడి శ్రీను అనే రైతుకు చెందిన 20 సోలార్ ప్లేట్లు, ఈ ఏడాది మార్చి మొదటి వారంలో టంగుటూరు మండలం మల్లవరప్పాడులోని పెద్దచెరువు దక్షిణం వైపు కట్ట మీద ఉన్న నాగినేని రంగారావుకు చెందిన డీజిల్ ఇంజన్, అలాగే 10 రోజుల క్రితం సంతనూతలపాడు నుంచి మైనంపాడు వెళ్లే రోడ్డులో ఉన్న పొలాల్లో 15 సోలార్ ప్లేట్లు చోరీ చేసినటులపోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. గురువారం తనిఖీలు నిర్వహించే సమయంలో అనుమానాస్పదంగా ఉండగా అదుపులోకి తీసుకున్నామని, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ చెప్పారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది డి శ్రీనివాసరావు, ఎస్ వెంకటరావు, మహేష్, ఖాదర్‌వలి, నాగార్జునను సీఐ అభినందించారు.
డీజిల్ ఇంజన్లు, సోలార్ ప్లేట్ల దొంగలు ముగ్గురికి సంకెళ్లు
నిందితుల వివరాలు వెల్లడించిన
సింగరాయకొండ సీఐ
Comments
Please login to add a commentAdd a comment