
రాజకీయంగా ఎదుర్కోలేకే పోలీసు కేసులు
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులను రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు కేసులు బనాయిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఆదివారం త్రిపురాంతకం మండల పార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దాడి కేసులు నమోదు చేసిన సంఘటనను వారు తీవ్రంగా ఖండించారు. ఆంజనేయరెడ్డిని శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు కష్టడీలోకి తీసుకొని ఎవరికీ కనిపించకుండా చేయడాన్ని వారు తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంజనేయరెడ్డి దాడి చేశాడని పోలీసులు చెప్తున్న వ్యక్తిపై ఎటువంటి గాయాలు లేవని, కులం పేరుతో దూషించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, అటువంటి సమయంలో యర్రగొండపాలెం పోలీసులు విచారణ చేపట్టకుండా ఆయనను ఏ విధంగా అరెస్ట్ చేశారని వారు ప్రశ్నించారు. ఈ నెల 27వ తేదీ ఎంపీపీ ఎన్నిక ఉండటం వలన ఆంజనేయరెడ్డి ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో కావాలని నాటకీయంగా టీడీపీ వాళ్లతో కలిసి మూకుమ్మడిగా ఆయనను నిర్భందించారని వారు అన్నారు. ఇంతకంటే దౌర్జన్యం ఎక్కడా లేదని, ఎస్సై తన విధులను మరచి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడని, ఈ ఎన్నికలు జరగకుండా ఉండేందుకు ఆంజనేయరెడ్డిని అరెస్ట్ చేశారని వారు అన్నారు. ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆంజనేయరెడ్డిని వారు పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మూర్తిరెడ్డి, కె.ఓబులరెడ్డి, ఏకుల ముసలారెడ్డి ఉన్నారు.
వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలపై
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
త్రిపురాంతకం మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, ఎస్.సుబ్బారావులపై ఆదివారం యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గొడ్డలితో దాడి చేసినట్లు కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి మార్కాపురం రోడ్డులో తాము ఉన్న సమయంలో ఆంజనేయరెడ్డి, సుబ్బారావులు కలిసి కులం పేరుతో దూషించారని, గొడ్డలి తీసుకొని దాడి చేయడం వలన భుజంపై వాపు వచ్చిందని త్రిపురాంతకం అంబేడ్కర్ కాలనీకి చెందిన ఎం.సుందరబాబు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.