
‘పోషణ్ పక్వాడా’ విజయవంతం చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో 7వ పౌష్టికాహార పక్షోత్సవాలను మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8 నుంచి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషణ్ ట్రాకర్ లో నమోదు చేసుకునే విధానంపై ప్రచారం చేయటం, కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమం (సీఎంఏఎం) అమలు చేయడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం నివారిస్తారన్నారు. పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకునేలా చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్తహీనత కలిగిన కిశోర బాలికలపై, హై రిస్క్ ప్రెగ్నెంట్స్, ఊబకాయ పిల్లలు, బరువు తక్కువ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయడంతో పాటు పౌష్టికాహారం ఆవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఐసీడీఎస్, విద్య, హెల్త్, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ హేన సుజన మాట్లాడుతూ 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. తొలుత పక్షోత్సవాల్లో రోజు వారీగా నిర్వహించే కార్యక్రమం వివరాలను ఐసీడీఎస్ సీడీపీఓ మాధవి వివరించారు. ఈ సందర్భంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలకు సంబంధించి ప్రచురించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటేశ్వర రావు, మెప్మా పీడీ శ్రీహరి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.