
సీబీజీ భూముల కేటాయింపులో అత్యుత్సాహం
కురిచేడు: రిలయెన్స్ బయోగ్యాస్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు చేసిన హడావుడి భూ వివాదాలకు దారి తీసింది. కురిచేడు మండలంలో కంప్రస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ (సీబీజీ) ఏర్పాటు కోసం 799.40 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఈ భూమి రెండు శాఖల మధ్య వివాదాన్ని రేపింది. ఆ భూములు మావంటే, మావని రెండు శాఖల అధికారులు పోట్లాడుకుంటూ పనులు నిలిపేశారు. మంగళవారం తహసీల్దార్ రజనీకుమారి, ఆర్‌ఐ నాగరాజు, సర్వేయర్ గోపి, వీఆర్వో హనుమంతరావు, ఫారెస్ట్ రేంజర్ నరసింహారావు, బీట్ అధికారి ధనలక్ష్మి, సిబ్బంది సీబీజీకి కేటాయించిన భూముల విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డులు పరిశీలించి చర్చలు జరిపారు. అయితే ఈ భూమి కచ్చితంగా ఎవరదనేది తేల్చలేకపోయారు.
50 ఏళ్లుగా రెండు శాఖల మధ్య వివాదం..
దొనకొండ, కురిచేడు మండలాల సరిహద్దులో అటవీశాఖకు (రిజర్వు ఫారెస్టు) దొనకొండ మండలం బాదాపురం వద్ద నుంచి కురిచేడు మండలం గుండ్లకమ్మ వాగు వరకు పొట్లపాడు బీటు కింద సుమారు 13 వేల ఎకరాల అటవీభూమి ఉంది. కాల క్రమంలో హద్దులు చెరిగిపోయాయి. వాటిని జాయింట్ సర్వేచేసి హద్దులు నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈ విషయంపై ఆ రెండు శాఖలు పూర్తి స్థాయిలో ఆదిశగా ప్రయత్నాలు చేయలేదు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య ఇరు శాఖలకు తలనొప్పిగా మారింది. ఇలా భూములు కేటాయించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇరుశాఖలు పోట్లాడుకోవటం, తరువాత ఎవరికి వారు మిన్నకుండిపోవటం జరుగుతూ వస్తోంది.
ఆదాయ వనరుగా వివాదాస్పద భూమి
రెవెన్యూ–అటవీశాఖల మధ్య వివాదాస్పదంగా మారిన భూ వివాదం రెండు శాఖల్లోని కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మారింది. రెండు శాఖల్లోని కొందరి అధికారుల కనుసన్నల్లో భూములు ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అయితే అధికారుల సాయంతో నకిలీపట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి మరీ ఆ భూములను విక్రయించి సొమ్ముచేసుకున్నారని సమాచారం.
సీబీజీకి కేటాయించడంతో మళ్లీ తెరపైకి భూ వివాదం..
తాజాగా మండలంలోని గంగ దొనకొండ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 88, 90 లలోని 799.40 ఎకరాల భూమిని తాజాగా రెవెన్యూ అధికారులు సీబీజీ కి కేటాయించి నిర్మాణ సంస్థకు అప్పగించారు. అయితే ఆ భూములు అప్పగించే ముందు దానిని సర్వేచేయకుండా, ఆ భూముల్లోని పట్టాదారులకు సమాచారం ఇవ్వకుండా కేవలం రికార్డులు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. భూములను చదును చేసే క్రమంలో అటవీశాఖ అధికారులు ఆ భూములు మావి అంటూ చదును చేయకుండా అడ్డుకున్నారు. రెండు రోజులుగా కేటాయించిన స్థలంలో పనులు ఆగిపోయాయి. ఇరు శాఖల ఉన్నతాధికారులు చేరి రికార్డులు పట్టుకుని తిరుగుతున్నారే తప్ప ఆ భూమి ఎవరిది అనేది తేల్చకపోవటం విశేషం.
ఆ భూములు మావంటే మావని ప్రభుత్వ శాఖల పోట్లాట రెవెన్యూ–అటవీ శాఖల మధ్య తారస్థాయికి చేరుకున్న వివాదం రెండు రోజులుగా నిలిచిపోయిన ప్లాంట్ పనులు