
బాండెడ్ లేబర్ వ్యవస్థను నిర్మూలించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో బాండెడ్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో బాండెడ్ లేబర్ సిస్టం రద్దు యాక్ట్–1976పై అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లకు గురువారం ఉదయం కలెక్టర్ జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు బాండెడ్ లేబర్ వ్యవస్థ నుంచి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలన్నారు. కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాలతో పల్నాడు జిల్లాలో వెట్టిచాకిరి చేయిస్తుండగా రెస్క్యూ చేసి రక్షించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలతో బలవంతంగా పని చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో వేగంగా స్పందించి వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించడంతోపాటు రిలీఫ్ సర్టిఫికెట్లు అందజేశామన్నారు. దాంతో పాటు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కూడా ఇప్పించినట్లు చెప్పారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించిన ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కొత్తపట్నం తహసీల్దార్‌ను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.
తొలుత ఇంటర్‌నేషనల్ జస్టీస్ మిషన్ (ఐజేఎం) ప్రతినిధి ప్రియాంక బాండెడ్ లేబర్ సిస్టం రద్దు యాక్ట్–1976 గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని శాఖల అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఈ – శ్రమ్ పోర్టల్‌లో ప్లాట్ ఫాం కార్మికులు, గిగ్ కార్మికుల సమీకరణ, పేర్ల నమోదుపై అవగాహన కోసం కార్మిక శాఖ రూపొందించిన వాల్ స్టిక్కర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.