
పట్టణ నిరాశ్రయుల కేంద్రాల పరిశీలన
ఒంగోలు సబర్బన్: మెప్మా ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల కేంద్రాలను మెప్మా పీడీ శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. తొలుత రిమ్స్ ప్రాంగణంలో యాచకులైన సీ్త్రపురుషులు, పిల్లలు ఉండే నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించారు. యాచకులు, నిరాశ్రయులు సేదతీరడానికి వీలుగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఒకటి, ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరొకటి చొప్పున పట్టణ నిరాశ్రయుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత నెలలో సంచార యాచకులపై సర్వే చేసి సదరు రిపోర్టు ఆధారంగా యాచకులంతా పట్టణ వసతి గృహాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో నిరాశ్రయుల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, నిరాశ్రయులకు తగిన వసతి సదుపాయాలు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున డీహైడ్రేషన్ చెందకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, మంచినీరు అందించాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. పీడీ వెంట సంతోష్ కుమార్, రెడ్‌క్రాస్ సొసైటీ సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.