
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు
వేములవాడ: ప్రజలకు సేవల చేసేందుకే వేములవాడలో సంగీత నిలయాన్ని కట్టుకున్నానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు పేర్కొన్నారు. స్థానిక సంగీత నిలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 60 ఏళ్ల తన తండ్రి రాజకీయ వారసత్వం నుంచి ఎన్నో అంశాలు నేర్చుకునే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. వేములవాడ తనకు తల్లి లాంటిదని, తుదిశ్వాస వరకు అభివృద్ధి కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్‌లకే సీట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించారని, సీట్లు రాని ఎమ్మెల్యేలను స్వయంగా పిలి పించుకుని మాట్లాడారని, తనను మాత్రం పిలవలేదన్నారు.
పార్టీ ఆదేశాల మేరకే నియోజకవర్గంలో ఏడు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా వందల కోట్లు సంపాదించిన వారు ఏదేదో పేరుతో వస్తున్నారనీ, పేదవాడికి మెరుగైన వైద్యం అందించేందుకే వేములవాడలో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించామని స్పష్టం చేశారు. గుడి చెరువులోకి 365 రోజులు గోదావరి జలాలతో నింపుతామనీ, మూలవాగును మల్కపేట రిజర్వాయర్‌తో జీవనదిలా మార్చుతామన్నారు. భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ.100 కోట్ల పనులను ప్రారంభించుకుందామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, పార్టీ అధ్యక్షుడు పుల్కం రాజు, గోస్కుల రవి, కౌన్సిలర్లు మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి చందర్, యాచమనేని శ్రీనివాస్‌రావు, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, కో–ఆప్షన్ సభ్యుడు కట్కూరి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏశ తిరుపతి పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
వేములవాడఅర్బన్: తిప్పాపూర్‌లోని తెలంగాణచౌక్ వద్ద ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఆధ్వర్యంలో వికలాంగులు సీఎం కేసీఆర్ చిత్రాపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ దేశంలోనే సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టినిల్లుగా చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగుల ఇబ్బందులు తెలుసుకుని రూ.3016 ఉన్న ఫించన్‌ను మరో రూ.4,016 చేశారన్నారు. కౌన్సిలర్లు శ్రీనివాసరావు, అజయ్, జోగిని శంకర్, టేలర్ శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment