సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో పార్టీలో కొంతకాలంగా సాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కరీంనగర్ ఎంపీగా పార్టీ అధ్యక్షుడిగా ఇంతకాలం బీజేపీకి తిరుగులేని విజయాలు అందించిన బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. జిల్లా నుంచి పెద్దలీడర్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పించినా.. మరో కీలక పదవి కూడా ఇదే జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను వరించింది. ఇంతకాలం చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటలను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా పదోన్నతి కల్పించింది. బండిని తప్పించడం, ఈటలకు పదోన్నతి కల్పించడం వంటి పరిణామాలతో పార్టీ, ‘బండి’ వర్గంలో తీవ్ర నిస్తేజం నెలకొనగా.. ఈటల వర్గంలో కొత్త ఉత్సాహం మొదలైంది. మొత్తానికి పార్టీలో జిల్లా నేతలకు పదవులు మారినా.. అధిష్టానం వద్ద పట్టునిలుపుకోవడంలో కరీంనగర్ నాయకులు మరోసారి సత్తా చాటుకున్నట్లయింది.
ఫలించిన ఈటల మంత్రాంగం..!
జిల్లాలో సీనియర్ మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ది సుదీర్ఘ రాజకీయ అనుభవం. టీఆర్‌ఎస్‌లో చేరి అనతికాలంలో కేసీఆర్‌కు కుడిభుజంలా మారారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పాత్ర ప్రజలందరికీ తెలిసిందే. 2004లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానంప్రారంభించిన ఈటల రాజేందర్ ఆపై వెనుదిరిగి చూసుకోలేదు. 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2021లో రాష్ట్రంలో మొత్తం ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికై న ఏకై క ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ది తిరుగులేని రికార్డు. ఇందులో 2008, 2009, 2010లో ఏడాదికి ఒకసారి చొప్పున అసెంబ్లీకి గెలుస్తూ హ్యాట్రిక్ సాధించారు. 2021లో మరో ఉపఎన్నికలో విజయం సాధించి అత్యధిక ఉప ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సొంతంచేసుకున్నారు.
► 2021లో అనూహ్య పరిస్థితుల మధ్య టీఆర్‌ఎస్‌ను వీడిన రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో బీజేపీ నుంచి విజయం సాధించారు. బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి రాజేందర్‌ను పార్టీ అధ్యక్షపదవి వరిస్తుందనుకున్నా.. జరగలేదు. ఈ క్రమంలో ఆయన అధిష్టానంపై ఒత్తిడి ప్రారంభించారు. బండికి వ్యతిరేకంగా సీనియర్లను కూడగట్టేందుకు యత్నించారు. ఒకదశలో పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. మొత్తానికి రాజేందర్ వ్యూహం ఫలించింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించడంతో ఈటల వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బండిని తప్పించడంపై నిరాశ..
బీజేపీకి కొత్త ఊపు తీసుకువచ్చిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒ క సంచలనం. సంఘ్ పరివార్ నేపథ్యమున్న బండి 2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా అనూహ్య విజయం సాధించారు. 2020లో రాష్ట్ర అధ్యక్ష ప దవి చేపట్టిన బండి సంజయ్ పార్టీకి కొత్త జోష్ నింపారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలి ఉపఎ న్నిక దుబ్బాకలో బండి సంజయ్ నేతృత్వంలో పా ర్టీ ఎలాంటి పొత్తులు లేకుండా విజయం సాధించి రికార్డు సృష్టించింది. అనంతరం బండి తన దూ కుడును జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అదేస్థాయిలో కొ నసాగించారు.
ఏకంగా 46 కార్పొరేటర్ స్థానాల్లో కాషాయజెండా ఎగరేసి అధికార పార్టీకి చెమటలు పట్టించారు. 2021 హుజూరాబాద్ ఎన్నికలోనూ ఈటల రాజేందర్ గెలుపుతో బండి గ్రాఫ్ మరింత పెరిగింది. 2022 జనవరిలో 317 జీవోకి వ్యతిరేకంగా బండి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం జాతీయస్థాయిలో చర్చ జరిగింది. ఇటీవల పదో తరగతి పేపర్ లీకేజీలు, భైంసా సభ సమయంలోనూ బండిని పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా కేడర్‌ను ఏకంచేశాయి. 2022 మునుగోడు ఉపఎన్నికల్లోనూ బీజేపీ చివరి వరకు పోరాడింది. ప్రజాసంగ్రామ యాత్రలతో కేవలం తన పార్లమెంటు సెగ్మెంటుకే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించారు. అప్పటిదాకా 10 శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేర్‌ను 34.5 శాతానికి పెంచారు.
త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి..
అదే సమయంలో బండి జిల్లాలో సీనియర్లను కలుపుకొనిపోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్‌ని నేటికీ నియమించకపోవడంపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పార్టీలో నగర అధ్యక్షుడిని నియమించకుండా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ అంటూ జోన్లు విభజించి ఎవరికీ పట్టు దక్కనీయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో బండి నిర్ణయాలను సమర్థించే ఫాలోవర్లకు కొదవలేదు. బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ.. సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. నగర పశ్చిమ డివిజన్ కార్యవర్గం రాజీనామా చేయడం గమనార్హం. రెండుమూడురోజుల్లో బండి సంజయ్‌ని కీలక పదవి వరించనుందని సమాచారం. కేంద్ర కేబినెట్‌లో బండికి చోటుదక్కనుందని పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment