సిరిసిల్లఎడ్యుకేషన్/తంగళ్లపల్లి/బోయినపల్లి/వేములవాడఅర్బన్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం తెలుగు పరీక్షకు 6,766 మంది విద్యార్థులకు 6,752 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పర్యవేక్షించారు. మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పరీక్షల నియంత్రణ సహాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలోని కేంద్రాలు తనిఖీ చేశారు. బోయినపల్లి హైస్కూల్, వేములవాడ కిడ్స్ కాన్వెంట్, వేములవాడ హైస్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లోని కేంద్రాలను జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తనిఖీ చేశారు.
ఆటో ఏర్పాటు చేసిన యూత్ నాయకుడు
తంగళ్లపల్లి మండలం మండెపల్లి డబుల్ బెడ్‌రూమ్ సముదాయం(కేసీఆర్ నగర్)లోని పదో తరగతి విద్యార్థుల కోసం యూత్ నాయకుడు కట్ట రవికుమార్ రెండు ఆటోలను ఏర్పాటు చేశాడు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అటు గొర్రెలు.. ఇటు విద్యార్థులు
బోయినపల్లి మండలకేంద్రంలోని హైస్కూల్‌లోని పదోతరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. మరో వైపు గొర్రెలు స్కూల్ ఆవరణలోకి ప్రవేశించాయి. హైస్కూల్‌కు ప్రహరీ లేకపోవడంతో గ్రౌండ్‌లోకి పశువులు, మేకలు, గొర్రెలు ప్రవేశిస్తున్నాయి.
● తొలిరోజు 6,752 మంది హాజరు
‘పది’ పరీక్షలు ప్రారంభం