
భూసార పరీక్షలు ఏమైనట్టో..
చందుర్తి(వేములవాడ): పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులకు వారి భూములపై అవగాహన ఉండాలి. ఏ పంటలు వేస్తే ఆ నేలకు అనుకూలమో తెలియాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ క్లస్టర్‌కు భూసార పరీక్షల కిట్లు అందించింది. వీటి ద్వారా భూసార పరీక్షలు చేసి ఆ భూమిలో ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులది. కానీ కొన్నేళ్లుగా భూసార పరీక్షలు చేయడం లేదు.
42 క్లస్టర్లకే మినీ భూసార కిట్లు
మినీ భూసార పరీక్ష కేంద్రాలను 2018లో ప్రారంభించారు. జిల్లాలోని 57 క్లస్టర్లు ఉండగా 42 క్లస్టర్లకే మినీ భూసారకిట్లు వచ్చాయి. రెండేళ్లపాటు సేవలందించాయి. ఇందులో కేంద్రం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం వ్యయాన్ని కేటాయించేవారు. ప్రారంభించిన రెండేళ్లకే మట్టిపరీక్షలకు కావాల్సిన రసాయనిక కిట్లను అందజేయకపోవడంతో పరికరాలు రైతువేదికల్లో మూలనపడ్డాయి.
భూసార పరీక్షలు చేయాలి
రైతులు ఏటా సంప్రదాయ పంటలు సాగుచేస్తూ ఆర్థి కంగా నష్టపోతున్నారు. పంటల్లో అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. పెట్టుబడుల ఖర్చు రెండింతలు పెరిగిపోతుంది. జాతీయ సుస్థిర వ్యసాయాభివృద్ధి పథకంలో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి, కార్డులను అందజేస్తే వాటికి అనుగుణంగా రైతులు పంటలు సాగుచేస్తారు.
– పెంటయ్య, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఎలాంటి ఆదేశాలు రాలేదు
గ్రామస్థాయిలో భూసార పరీక్షల చేపట్టేందుకు కావాల్సిన పరికరాలు ఉన్నాయి. కానీ పరీక్షలు చేయాలని ఎలాంటి ఆదేశాలు అందలేదు. రైతువేదికలో మినీ భూసార కిట్లు ఉన్నాయి. రసాయనిక కిట్లను అందజేస్తే పరీక్షలు చేస్తాం. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేసుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
– రామారావు, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయాధికారి
మూలకుపడ్డ మినీ భూసారకిట్లు
సరఫరా లేని రసాయనిక కిట్లు
నేల రకాలపై రైతులకు అవగాహన కరువు

భూసార పరీక్షలు ఏమైనట్టో..