● సమీపిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ గడువు ● 25 శాతం సబ్సిడీ వినియోగించుకోవాలంటున్న అధికారులు ● ఈనెల 31తో ముగియనున్న అవకాశం ● గడువు దాటితే పూర్తి రుసుం చెల్లించాల్సిందే.. ● ప్రచారం చేస్తున్న అధికారులు ● గ్రామాల్లో డప్పు చాటింపు, వ్యక్తిగతంగా ఫోన్‌కాల్స్
వేములవాడ: లేఅవుట్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన 25 శాతం సబ్సిడీని వినియోగించుకోవాలని మున్సిపల్ అధికారులు ప్రచారం కల్పిస్తున్నారు. ఈనెల 31తో గడువు ముగియనుండగా.. ఆలోపే చలాన్ చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాలనీల్లో డప్పు చాటింపు చేయించడంతోపాటు గతంలో రూ.వేయి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
2020లో రూ.వేయితో దరఖాస్తు
అనధికారిక లే–అవుట్లలో ప్లాట్లు కొన్న వారికి తమ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో అవకాశం ఇచ్చింది. రూ.వేయి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో వేములవాడ మున్సిపల్ పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. తాజాగా గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆమేరకు గతంలో రూ.వేయి చెల్లించిన వారు నేరుగా మున్సిపాలిటీకి చేరుకుని ఎల్‌ఆర్‌ఎస్ రెగ్యులరైజ్ చేసుకోవచ్చని మైక్‌లలో ప్రచారం చేస్తున్నారు.
ఇవీ గమనించండి
ప్రభుత్వ భూములు, జలవనరుల సమీపంలో ఉన్న లేఅవుట్లు ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి రావు. ఫీజు చెల్లింపులు ఆన్‌లైన్‌లో లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించకుండా నేరుగా బిల్డింగ్ అనుమతులు పొందితే, అదనంగా 33 శాతం కాంపౌండ్ ఫీజు విధించబడుతుంది.
రెగ్యులర్ చేసుకుంటే మంచిది
ప్లాట్ల యజమానులు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఈనెల 31 వరకు అవకాశం ఉంది. ఆలోపు చేసుకోకుంటే ప్రస్తుతం ఉన్న భూమి విలువతోపాటు ప్రస్తుతం వచ్చే 25 శాతం రాయితీని కోల్పోతారు. ఇంటి నిర్మాణం సమయంలో 33 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
– అన్వేశ్, మున్సిపల్ కమిషనర్
వేములవాడలో ఎల్‌ఆర్‌ఎస్ ఇలా..
గుర్తించిన ప్లాట్లు : 13,072
చెల్లింపులు జరిగినవి: 1,000