
ఉచితం అంటూనే వసూలు
● ఒక్కొక్కరికి రూ.వేయి ● కనీస సౌకర్యాలు కరువు ● సిరిసిల్ల ‘సెరాలైఫ్’కు క్యూ కడుతున్న వృద్ధులు ● డిగ్రీ చేసిన యువకుడే వైద్యుడు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో వృద్ధులు, ఒళ్లునొప్పులతో బాధపడే వారు టార్గెట్‌గా శాసీ్త్రయత లేని వైద్యసేవలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం అంటూ ప్రచారం చేస్తూ ‘సెరాలైఫ్’ సంస్థ పది బెడ్లు వేసి ఓ ఇంటిలో వైద్యం చేస్తోంది. కర్ణాటకకు చెందిన డిగ్రీ చదివిన యువకుడు ఇక్కడ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఒక్క చికిత్సతో ఐదు రకాల ప్రభావాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆక్యుప్రెషర్ పరికరాలను పదింటిని ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. ‘సెరాలైఫ్’ ప్రచారంతో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాది మంది వృద్ధులు, మహిళలు నిత్యం ఉదయం 6 గంటల నుంచే జిల్లా కేంద్రంలోని పెద్ద బజారుకు చేరుకుంటున్నారు. రోడ్డుపైనే క్యూ కడుతున్నారు. అక్కడికి వచ్చిన వారికి కనీసం తాగునీటి వసతి, మరుగుదొడ్లు లేవు. క్యూ పద్ధతిలో చూపించేందుకు వచ్చిన వారి చేతులపైనే నంబరు రాయడం గమనార్హం.
అన్ని నొప్పులకు ఒక్కటే చికిత్స !
వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు(బీపీ), మధుమేహం (షుగర్), ఆస్తమా, స్ట్రోక్, మైగ్రేన్, అధిక వెన్నునొప్పి, చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్, రుమటిజం, హెర్నియా వంటి పలు రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు.
ఉచితం పేరిట రూ.వేయి వసూలు
ఉచిత వైద్యం అంటూనే ఒక్కొక్కరి వద్ద రూ.వేయి వసూలు చేస్తున్నారు. రూ.వేయి తీసుకుని ఓ కార్డు ఇస్తూ మూడు నెలల వరకు ఉచిత వైద్యం చేస్తామని చెబుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.10 వసూలు చేస్తున్నామని చెబుతూ.. వందలాది మందిని సభ్యులుగా చేర్పించారు. ఇప్పటికే సిరిసిల్ల ‘సెరాలైఫ్’లో 300 మంది రూ.వేయి చొప్పున చెల్లించారు. అంటే రూ.3లక్షల వరకు ఇప్పటికే వసూలుకాగా.. ఇంకా కొత్త సభ్యులు చేరుతూనే ఉన్నారు. ‘సెరాలైఫ్’ సెంటర్‌కు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అనుమతి లేకపోవడం గమనార్హం. ఆక్యుప్రెషర్ పేరిట బెడ్స్ వేసి అందిస్తున్న వైద్యసేవల ఫొటోలు తీసేందుకు ‘సాక్షి’ ప్రయత్నిస్తే నిర్వాహకులు నియంత్రించారు. సిరిసిల్లలో సాగుతున్న ఆక్యుప్రెషర్ వైద్యంపై జిల్లా అధికారులు దృష్టిసారించి వాస్తవికతను బహిరంగ పరచాల్సిన అవసరం ఉంది.
సమయం: ఉదయం 7.30 గంటలు
స్థలం: సిరిసిల్ల పెద్దబజారు.. హన్మాండ్ల గుడి వద్ద
అంశం: ‘సెరాలైఫ్’ సంస్థ ఆక్యుప్రెషర్ వైద్యం
ప్రత్యేకత: వైద్యవిద్యలో ఎలాంటి డిగ్రీ లేకున్నా.. పది మంచాలు వేసి వైద్యసేవలు
విశేషం: ఉచిత చికిత్స అంటూ ప్రచారం.. ఒక్కొక్కరి వద్ద రూ.వేయి వసూలు
కొసమెరుపు : ఆరోగ్యం.. ప్రేమ.. సేవ అంటూ కరపత్రాలు.. అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి కూర్చోను కుర్చీలు లేవు.. నిల్చోను నీడ లేదు.
కార్డుకే రూ.వేయి తీసుకుంటున్నాం
‘సెరాలైఫ్’ సెంటర్‌కు వచ్చే వారికి కార్డు ఇచ్చి రూ.వేయి తీసుకుంటున్నాం. ఈ కార్డు మూడు నెలల వరకు పనిచేస్తుంది. కామారెడ్డి, హైదరాబాద్‌లోనూ మా సెంటర్లు ఉన్నాయి. ఉచిత బస్సు కావడంతో చాలా మంది వృద్ధ మహిళలు పొద్దున్నే వచ్చి రోడ్డుపై కూర్చుంటున్నారు. మా సెంటర్‌లో ఇంతకంటే వసతి కల్పించే పరిస్థితి లేదు.
– కృష్ణ, సెరాలైఫ్ నిర్వాహకుడు, సిరిసిల్ల

ఉచితం అంటూనే వసూలు