మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి | - | Sakshi
Sakshi News home page

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి

Published Mon, Mar 31 2025 10:53 AM | Last Updated on Mon, Mar 31 2025 12:57 PM

మామిడ

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి

జగిత్యాలఅగ్రికల్చర్‌: మామిడి కొనుగోలు సీజన్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో జగిత్యాల (చల్‌గల్‌)లోని మామిడి మార్కెట్‌లో మామిడి కొనుగోళ్లు ఎలా చేపట్టాలనే అంశంపై అనిశ్చితి నెలకొంది. వ్యాపారుల్లో ఓవర్గం ఓపెన్‌ (బహిరంగ వేలం) పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని చూస్తుండగా.. మరోవర్గం కమీషన్‌ ప్రతిపాదికన చేయాలని భావిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనని మార్కెట్‌ అధికారులు సతమతం అవుతూ తాత్సారం చేస్తున్నారు.

జూన్‌ వరకు కొనుగోళ్లు

జగిత్యాల మామిడి మార్కెట్‌లో కొనుగోలు చేసిన బంగినపల్లి, దశేరీ, హిమాయత్‌ తదితర రకాల మామిడి కాయలు నాణ్యతగా ఉంటాయనే పేరుంది. ఇక్కడి కాయలకు ఢిల్లీ, నాగ్‌పూర్‌, చంఢీఘర్‌, హర్యానా, పంజాబ్‌, జమ్మూ, కాశ్మీర్‌, బంగ్లాదేశ్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ఆయా ప్రాంతాల వ్యాపారులు మామిడి సీజ న్‌ రాగానే ఈ ప్రాంతంపై వాలుతుంటారు. మామిడి మార్కెట్‌ సీజన్‌ ఏప్రిల్‌ రెండో వారంలో ప్రారంభమై.. జూన్‌ మొదటి వారం వరకు ఉంటుంది. మామిడి మార్కెట్‌లో ఓ పద్ధతంటూ లేకపోవడంతో గతేడాది కొందరు వ్యాపారులు ఓపెన్‌మార్కెట్‌లో కొనుగోలు చేశారు. మరికొందరు కమీషన్‌ పద్ధతిలో కొన్నారు. ఈ సీజన్‌లో ఏ పద్ధతిలో కొనుగోలు చేస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు, అధికారులు, రైతుల్లో అయోమయం నెలకొంది.

కమీషన్‌ పద్ధతిలో ఇలా..

మామిడి కొనుగోలుకు మార్కెట్‌ కమిటీ నుంచి వ్యాపారులు లైసెన్స్‌ తీసుకుంటారు. మార్కెట్‌లో షెడ్లు ఏర్పాటు చేసుకుని షెడ్లకు వచ్చిన కాయలను బట్టి ఎవరికి వారే కొనుగోలు చేస్తుంటారు. రైతులు తోటలోని నాలుగైదు కాయలను శాంపిల్‌గా తీసుకొచ్చి వ్యాపారులకు చూపింస్తుంటారు. వ్యాపారులు ఆ కాయల నాణ్యత, పరిమాణం బట్టి ధర నిర్ణయిస్తుంటారు. వ్యాపారులు చెప్పిన రేటు నచ్చితే రైతులు కాయలను తెంపుకొని వచ్చి విక్రయిస్తుంటారు. ఈ పద్ధతిలో రైతులకు అన్యాయం జరుగుతుందని కొందరు వాదిస్తున్నారు. మామిడి శాంపిల్స్‌ తీసుకొచ్చిన సమయంలో ఓ రేటు.. మొత్తం కాయలు తీసుకొచ్చిన తర్వాత తిరకాసు పెట్టి రేటు తగ్గిస్తున్నారని, దీంతో రైతులు ఏమీ చేయలేక ఏదో ధరకు విక్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా సూట్‌, రాటన్‌, క్యాష్‌ కటింగ్‌ పేర రైతులను ఇష్టారీతిన దోచుకుంటున్నారని అంటున్నారు.

ఓపెన్‌ మార్కెట్‌లో ఇలా..

ఓపెన్‌ పద్ధతిలో కొనుగోళ్లు జరిపితే రైతులకు న్యాయం జరుగుతుందనేది మరికొందరి వాదన. ఈ పద్ధతిలో లోకల్‌ వ్యాపారులు కాకుండా ఢిల్లీ, నాగ్‌పూర్‌ వంటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తద్వారా వ్యాపారుల్లో పోటీ పెరిగి రైతులకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసిన కాయలను వెంటనే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం సాధ్యం కాదని, కాయలు చెడిపోతాయని చెబుతున్నారు. ఈ విధానంలో రైతుల నుంచి నాలుగు శాతం కమీషన్‌ కట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓపెన్‌ పద్ధతిలో కొనుగోళ్లు సాగితే మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తుంది. ఓపెన్‌ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి రేటు తగ్గించే అవకాశం కూడా ఉందని, తాము కొనుగోలు చేయమని మొండికేస్తే కాయలను ఎక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవాలనే దానిపై రైతులు ఆందోళన ఉంది.

నిస్సాహాయ స్థితిలో అధికారులు

మార్కెట్‌ నిబంధనల ప్రకారం మామిడి కొనుగోళ్లు ఓపెన్‌ పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలి. కొందరు రైతులు, వ్యాపారులు ఓపెన్‌ మార్కెట్‌ను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు రైతులు, వ్యాపారులు కమీషన్‌ ప్రతిపాదిత మార్కెట్‌ను బలపరుస్తున్నారు. దీనికితోడు మార్కెట్‌ అధికారులు వ్యాపారులపై నిబంధనల ప్రకారం ఒత్తిడి తెస్తే రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు, చీవాట్లు. దీంతో రైతులు, వ్యాపారులు, రాజకీయ నాయకుల మధ్య మార్కెట్‌ అధికారులు నలిగిపోతూ ఏమి చేయలేని నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. మామిడి మార్కెట్‌లో కఠిన నిబంధనలు అమలు చేస్తేనే మామిడి మార్కెట్‌ ఓ దారికి వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఇష్టారీతిన వారు వెళ్తుండడంతో చివరకు రైతులు బలవుతున్నారు. ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరితో చర్చించి, ఇతర పండ్ల మార్కెట్ల మాదిరిగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని రైతులు చెబుతున్నారు.

ఓపెన్‌ మార్కెటా..? కమీషన్‌ మార్కెటా..?

అయోమయంలో మార్కెట్‌ అధికారులు

ఆందోళనలో అన్నదాతలు, వ్యాపారులు

నిబంధనలు అమలు చేయాలి

మామిడి మార్కెట్‌లో నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారడంతో మార్కెట్‌కు రావాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఉంది. ఎవరి ఇష్టానుసారం వారు కొనుగోళ్లు చేస్తూ చివరకు రైతులను బలిపశువును చేస్తున్నారు.

– కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, మామిడి రైతు, మేడిపల్లి

అమలు చేస్తాం

మామిడి మార్కెట్‌లో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం. మామిడి మార్కెట్‌పై పూర్తి స్థాయిలో చర్చించేందుకు వ్యాపారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటాం. రైతులకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరుగకుండా చూస్తాం.

– ప్రకాశ్‌, జిల్లా మార్కెట్‌ అధికారి

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి1
1/3

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి2
2/3

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి3
3/3

మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement