
ఐరిస్ నమోదు చేస్తూ ధాన్యం కొనుగోళ్లు
● డీఆర్‌డీవో శేషాద్రి
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఐరిస్(కంటిపాప)ను నమోదు చేయాలని డీఆర్‌డీవో శేషాద్రి సూచించారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ధాన్యం కొనుగోళ్లపై మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు. డీఆర్‌డీవో మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్యాడీక్లీనర్‌తో శుద్ధిచేసిన వడ్లను వ్యవసాయ విస్తరణ అధికారి ధ్రువీకరించిన తర్వాతే సేకరించాలని సూచించారు. సన్న వడ్లను, దొడ్డు వడ్లను వేర్వేరుగా సేకరించాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన రైస్‌మిల్లులకు వెంటనే తరలించాలన్నారు. అదనపు డీఆర్‌డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎంలు సుధారాణి, ఎం.శ్రీనివాస్, పౌరసరఫరాల ఆఫీస్ అధికారి రాజశేఖర్, జిల్లా సమాఖ్య ప్రతినిధులు, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, గంభీరావుపేట ఏపీఎంలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు, బుక్‌కీపర్లు పాల్గొన్నారు.