డామిట్‌.. కథ అడ్డం తిరిగింది | - | Sakshi
Sakshi News home page

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది

Published Sat, Apr 5 2025 1:46 AM | Last Updated on Sat, Apr 5 2025 1:46 AM

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది

● అక్రమ బంగారం అసలుకే మోసం ● బాధితుడి చిరునామాపై ఆసక్తి ● వేములవాడ ఠాణాలో కేసు నమోదుపై చర్చ

చందుర్తి(వేములవాడ): బంగారం వ్యాపారంతో డబ్బులు సంపాదించాలనే ఆశలు తలకిందులవుతున్నాయి. దుబాయి, సౌదీ అరేబియాల నుంచి బంగారం తీసుకొస్తే కమీషన్‌ ముట్టజెప్పే ముఠాలకు కొందరు సరఫరాదారులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల జిల్లాలో జరిగాయి. తంగళ్లపల్లి మండలం మండపల్లికి చెందిన ఆసాని రాజు చందుర్తి మండలం సనుగులకు చెందిన పులి శ్రీకాంత్‌ ద్వారా 10 తులాల బంగారం పంపించాడు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు తీసుకున్నారని చెప్పి, 10 తులాల బంగారం ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మూడు నెలల క్రితం శ్రీకాంత్‌పై తంగళ్లపల్లి ఠాణాలో కేసు నమోదైంది. తాజాగా చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన బీరయ్య, అనిల్‌ కలిసి సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్‌ వరకు బంగారం తీసుకొచ్చేందుకు చెరో రూ.లక్ష చొప్పున ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఎయిర్‌పోర్టు దాటిన తర్వాత మూడో వ్యక్తిగా భావిస్తున్న బీరయ్య బావమరిది మోసం చేసి ఎత్తుకెళ్లాడన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఎన్గల్‌కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

బాధితుడి అడ్రస్‌పై ఆసక్తి

సౌదీ అరేబియా నుంచి ఎంత బంగారం వచ్చింది.. ఎవరూ పంపారన్న విషయాలపై చర్చలు సాగుతున్నాయి. బంగారం బాధితులు ఎక్కడి వారనే విషయాలను పోలీసులు గుట్టువిప్పడం లేదు. వేములవాడకు చెందిన వ్యక్తి కావడంతోనే ఇక్కడి పట్టణ ఠాణాలో కేసు నమోదై ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే నిజాబామాద్‌ జిల్లా భీంగల్‌ అని, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్‌ ప్రాంతాలకు చెందిన వారు.. అనే ప్రచారం సైతం ఉంది. కేసు విచారణ చేస్తున్న పోలీస్‌ అధికారి మాత్రం విచారణ పూర్తయ్యే వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పదుల సంఖ్యలో వ్యాపారులు

అక్రమ బంగారం వ్యాపారం చేసే వారు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. విదేశీ బంగారాన్ని కొనుగోలు చేయించి 10, 20 తులాల చొప్పున వ్యాపారం చేయించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కొందరు హైదరాబాద్‌ కేంద్రంగా ఈ వ్యాపారానికి తెరలేపగా, మరికొందరు మహారాష్ట్ర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నారన్న ప్రచారంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement