
వ్యవసాయ రంగానికి ఊతం
● సాగు సమస్యలపై బృందాలవారీగా చర్చలు
● ముగిసిన ఉత్తర తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతాయని, పంట పెట్టుబడి ఖర్చులు తగ్గించి, రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలుంటాయని ఉత్తర తెలంగాణ జోనల్‌స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు అభిప్రాయపడింది. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు సాగిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, అభ్యుదయ రైతుల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సదస్సుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ డీన్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ ఎన్.బలరాం, డీన్ ఆఫ్ ఎక్స్‌టెన్సన్ డాక్టర్ ఏకాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పంటలవారీగా 10 బృందాలు ఏర్పాటు చేసి.. ఆయా పంటల్లో సమస్యలేమిటి, వాటికి ఎలాంటి పరిష్కారాలను చూపాలనే దానిపై శాస్త్రవేత్తలు, రైతులు బృంద చర్చలు జరిపారు. వరిలో నూక శాతం ఎక్కువ లేని, తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాలతోపాటు చలి, ఆకుమచ్చ, ఎండాకు తెగులు, సుడి దోమను సమర్థవంతంగా తట్టుకునే వరి రకాలపై మరింతగా పరిశోధనలు చేయాలనే అభిప్రాయం వచ్చింది. పంటలపై వాతావరణ ప్రభావంపై యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ లీలారాణి వివరించారు.
గళమెత్తిన రైతులు
ఉత్తర తెలంగాణలోని పది జిల్లాల నుంచి హాజరైన రైతులు పలు సాగు సమస్యలను సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. రసాయనాలు లేకుండా పంటలు పండించే పద్ధతులపై పరిశోధనలు చేయాలని కోరారు. కోతుల బెడదతో కష్టపడి సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయని, వీటిపై ఆలోచనలు చేయాలని కోరారు.
శాస్త్రవేత్తల సమాధానాలు
రైతులు అడిగిన పలు ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. పత్తి పంటను ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ వరకు తీసేసి ఇతర పంటను వేసుకోవాలని, లేదంటే గులాబీ పురుగు విజృంభించి నష్టం చేస్తుందని సూచించారు. వరి పంటను అవసరానికి మించి సాగు చేస్తుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే ఇతర పంటల వైపు రైతులు ఆలోచన చేయాలని కోరారు.

వ్యవసాయ రంగానికి ఊతం