
ఎస్సారెస్పీ భూముల ఆక్రమణ
అధికారుల నిర్లక్ష్యంతోనే
అధికారుల నిర్లక్ష్యంతోనే మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెల్తున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయినట్లు సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. సర్వే చేయించి ఆక్రమదారుల చేతిలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి.
– పల్లె మోహన్‌రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు
నిరుపేదలకు పంచాలి
భూమిలేని నిరుపేదలను గుర్తించి ప్రభు త్వ భూములను పంచాలి. ప్రభుత్వం భూపంపిణీ పథకం అమలు చేసి ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలి.
– బొమ్మెన స్వామి, పెగడపల్లి
నోటీసులు జారీ చేస్తాం
స్థలం ఆక్రమణకు చేసిన రైతులకు నోటీసులు జారీ చేస్తాం. కాల్వ భూములు ఆక్రమణకు గురయిన మాట వాస్తవమే. ఆక్రమణ చేసిన రైతుల వివరాలను ఉన్నతాధికారలకు నివేదిస్తాం.
– స్వామి, ఎస్సారెస్పీ ఏఈ
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ భూముల ఆక్రమించడం నేరం. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నాం. గ్రామాల వారిగా వాటి వివరాలు ఆ యా గ్రామాల పంచాయతీల వద్ద ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తాం.
– రవీందర్, తహసీల్దార్
పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో విలువైన మంచరాయి, పరంపోగు భూములతోపాటు ఎస్సారెస్పీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో 6,748.01 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే 1200 ఎకరాల అటవిభూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములను ఆనుకుని ఉన్న పంటపొలాల రైతులు వాటిని ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. కొందరు ఏకంగా మామిడి తోటలు పెంచుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని నంచర్ల శివారులో గొరిగల బోరు సర్వే నంబర్‌లో 352 ఎకరాలు, దులాల బోరు సర్వే నంబర్ 379లో 272, వెంకటేశ్వర బోరు సర్వే నంబర్ 440లో 68 ఎకరాలు, దోమలకుంటలో టేకుల బోరులో 150 ఎకరాలు, చింతలలొద్దిలో 70 ఎకరాలు, పెగడపల్లి ఆడ్డగుట్ట, ఎల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో కొంతభాగాన్ని వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల రైతులు ఆక్రమించుకున్నారు. కొందరు మామిడి తోటలు పెంచుతుండగా.. మరికొందరు ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. భూముల ఆక్రమణలను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సారెస్పీ భూముల పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైంది. కొందరు రైతులు కాల్వ గట్టు అంచు వరకు సాగు చేస్తుండంతో వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మండలంలోని 26 గ్రామాలకు 24 గ్రామాలు ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతం పరిధిలో ఉన్నాయి. వందలాది కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువల పక్కన ప్రాజెక్టు భూమి ఉంది. కాలువల నిర్మాణ సమయంలో ఇరువైపులా వాహనాలు వెళ్లేందుకు వీలుగా భూమిని వదిలారు. ఎస్సారెస్పీ మేజర్, మైనర్ కాలువలు కొందరు రైతులు ఆక్రమణకు చేసి కాల్వ గట్ల అంచువరకూ సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం కాలువ లైనింగ్ పనులు చేసిన సమయంలో ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు ప్రతి 50 మీటర్ల చొప్పున కాలువకు ఇరువైపులా హద్దురాళ్లను కూడా నాటారు. ఇక్కడ భూములకు లక్షల విలువ ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో విరివిగా పంటలు పండుతుండటంతో కొందరు రైతులు హద్దురాళ్లను తొలగించి సాగు చేసుకుంటున్నారు. డి–65 నుంచి డీ–83ఏ వరకు 10 వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. వీటి కింద 65, 67, 68, 69, 70, 71, 74, 75, 79, 81 డిస్ట్రీబ్యూటరీ కాల్వలున్నాయి. వీటి కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఎల్, 5ఎల్, 6ఎల్, డి–83 ఏ కింద 1ఎల్, 2ఎల్, 3ఎల్, 4ఆర్ మైనర్ కాల్వలున్నాయి. మేజర్ కాలువతోపాటు మరికొందరు రైతులు మైనర్ కాల్వ గట్లను కూడా వదలకుండా ఆక్రమించి పంటలు పండిస్తున్నారు. కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు వారిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో భూ భూఆక్రమణలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో కాల్వల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు చోద్యంచూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల పరిస్థితి ఇలా ఉంటే ప్రాజెక్టు ఆధీనంలో ఉన్నా మొరం గడ్డలు తరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం మొరం అవసరమున్న వ్యక్తులు ముందుగానే ఎస్సారెస్పీ పేర కొంత రుసుం చెల్లించి మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్రధాన కాల్వ ఇరువైపులా ఉన్న మొరంగడ్డలను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండటంతో ఎస్సారెస్పీ వేలాది రూపాయల ఆధాయం కోల్పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి మొరం గడ్డల మట్టి తరలింపును అడ్డుకోవాలని, ఆక్రమణకు గురైనా ఎస్సారెస్పీ, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు

ఎస్సారెస్పీ భూముల ఆక్రమణ

ఎస్సారెస్పీ భూముల ఆక్రమణ

ఎస్సారెస్పీ భూముల ఆక్రమణ