
చందుర్తి సింగిల్‌విండోలో భారీ కుంభకోణం
● విచారణలో బయటపడ్డ రూ.1.68కోట్ల అవినీతిపర్వం ● సీఈవో స్వాహా చేసిన సొమ్ము రూ.1.03లక్షలు ● పాలకవర్గం రికవరీ చేయాల్సిన సొమ్ము రూ.65లక్షలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీ కుంభకోణం బయటపడింది. ఇప్పటికే రైతుల పేరిట పంట రుణాలను తీసుకుని స్వాహా చేసిన సీఈవో గంగారెడ్డిని ఐదు నెలల క్రితమే సస్పెన్షన్ చేయగా.. పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా సింగిల్‌విండో సొసైటీలో జరుగుతున్న 51 విచారణలో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. సొసైటీలో రూ.1.68కోట్లు పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. ఇందులో రూ.1.03కోట్లు సస్పెన్షన్‌కు గురైన సీఈవో గంగారెడ్డి స్వాహా చేశాడని తేలింది. అంతేకాకుండా మరో రూ.65లక్షలను సొసైటీలో వ్యక్తిగత రుణాలతోపాటు దీర్ఘకాలిక రుణాలు అందించారు. ఈ బకాయిలను 2013 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం సభ్యులు వసూలు చేయించకపోవడంతో బకాయి పడ్డాయని, వీటి వసూలుకు గత పాలకవర్గం సభ్యులు, ప్రస్తుత పాలకవర్గం సభ్యులతోపాటు సీఈవోలను బాధ్యులను చేస్తూ ఆ సొమ్ము వసూలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సహకార సంఘం అధికారులు విచారణ నివేదికను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లతోపాటు స్థానిక సొసైటీ ఇన్‌చార్జి సీఈవో శ్రీవర్ధన్‌లకు అందజేసినట్లు సమాచారం. కాగా ఈ విషయమై చందుర్తి ఇన్‌చార్జి సీఈవో శ్రీవర్ధన్ వివరణ కోరగా నెల రోజుల్లోపు పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి.. బహిర్గతం చేయాలన్న నింబంధనలు ఉన్నాయని విషయాన్ని దాట వేశారు.
చందుర్తి సొసైటీపై కలెక్టర్ ఆరా?
చందుర్తిలోని కొందరు రైతులు స్థానిక సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతోపాటు కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఇదే విషయమై జిల్లా కలెక్టర్ చందుర్తి సొసైటీ సిబ్బందిని, సహకార సంఘం అధికారులను విచారణ నివేదికతో కలెక్టర్ కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు స్థానికంగా ప్రచారం ఉంది.