
మత్తులో పేట్రేగిపోతున్నారు
● గంజాయి మత్తులో హత్యలు ● వేములవాడ ప్రాంతంలో భయాందోళన ● మైకంలోనే అఘాయిత్యాలు ● తప్పుదారి పడుతున్న యువత
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి చెట్టిపల్లి పర్శరాములు. కొన్నేళ్లుగా వేములవాడలోనే ఉంటున్నాడు. ఇతనికి గంజాయి సరఫరా దారులతో సంబంధాలు ఉన్నట్లు ఇతని హత్య ద్వారా బయటకు వచ్చింది. గంజాయి సరఫరాలో ఏర్పడిన తగాదాలతో చివరికి ప్రాణం పోయింది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న మృతదేహం వేములవాడ పట్టణానికి చెందిన శ్రీధర్‌ది. గతేడాది ఫిబ్రవరి 12న బైపాస్‌రోడ్డులోని సేవ్స్ పక్కన హత్యకు గురయ్యాడు. మిత్రులతో కలసి మద్యం సేవించి చిన్న చిన్న గొడవలు చివరికి హత్యకు దారితీశారు.
వేములవాడ: యువత మత్తులో చిత్తవుతున్నారు. గంజాయి సేవిస్తూ.. మద్యం తాగుతూ ప్రాణాలు తీస్తున్నారు. వేములవాడ పట్టణంలో ఈనెల 13న జరిగిన హత్యనే ఇందుకు సాక్ష్యం. గంజాయికి అలవాటుపడ్డ యువత క్రమంగా రవాణాదారులుగా మారుతున్నట్లు సమాచారం. చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాల్సిన వారు ఇలా మత్తులో చిత్తవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం
యువకులు, విద్యార్థులలో గంజాయి, మద్యం వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పాన్‌టేలాలు, బస్టాండు ప్రాంతాలు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ లభిస్తున్నట్లు సమాచారం. గ్రామాల శివారు ప్రాంతాలు, వేములవాడలో బైపాస్‌రోడ్లు, జగిత్యాల జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి ఎక్కువగా సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. తొలుత గంజాయికి అలవాటు పడేలా స్మగ్లర్లు యువతను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. పూర్తిగా మత్తుకు అలవాటు పడ్డ తర్వాత వారినే కొరియర్లుగా, విక్రేతలుగా మార్చి పెద్ద ఎత్తున దందా చేస్తున్నట్లు సమాచారం. మత్తులోనే తరచూ జరుగుతున్న హత్యలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గొడ్డళ్లు, కత్తులతో హత్యలకు దిగుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయపడుతున్నారు. ఇటీవల స్థానిక ఫంక్షన్‌హాల్ వద్ద హత్యకు పాల్పడ్డ గ్యాంగ్‌లోని యువకులు వారం రోజుల క్రితం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు కోనాయపల్లిలో హల్‌చల్ చేసినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. గస్తీ పోలీసులు చేరుకున్నప్పటికీ వారిని కట్టడి చేయలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సవాల్ విసురుతోన్న వీడియో
వేములవాడను వణికిస్తున్న హత్యల వెనుక అసలు కథ క్రమంగా వెలుగులోకి వస్తోంది. బైపాస్‌రోడ్డులో జరిగిన హత్య అనంతరం హంతకుడు గొడ్డలి పట్టుకొని ఇంకా కొంతమంది బాకీ ఉన్నారని. త్వరలోనే వాళ్ల అంతు చూస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో సవాల్‌గా విసురుతోందన్న చర్చ సాగుతోంది. ఈ హత్యల వెనుక వ్యక్తిగత కక్షలేనా? ఇంకేమైనా కుట్రలు దాగి ఉన్నాయా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఆరు నెలల్లో నమోదైన కేసులు
గంజాయి కేసులు 22
పట్టుబడ్డ యువత 55
స్వాధీనం చేసుకున్న గంజాయి
1.800 కిలోలు
స్వీయ నియంత్రణ అవసరం
గంజాయి నియంత్రణపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేశాం. చాలా మందిని జైలుకు పంపాం. గంజాయిపై అవగాహన పెంచుతూ సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా గంజాయి వినియోగించడం, విక్రయించడం వంటివి కనిపిస్తే 100కు డయల్ చేసి సమాచారం అందించాలి.
– శేషాద్రినిరెడ్డి, వేములవాడ ఏఎస్పీ

మత్తులో పేట్రేగిపోతున్నారు

మత్తులో పేట్రేగిపోతున్నారు

మత్తులో పేట్రేగిపోతున్నారు