
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిన్న మొన్నటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు పట్టా భూములుగా మారుతున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, భూదాన్ భూముల స్వరూపమే మారిపోతోంది. కొంత మంది రెవెన్యూ అధికారులు ఽభూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఽ‘ధరణి’ సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అడిగినంత ముట్టజెబితే చాలు.. అప్పటి వరకు పట్టా భూములుగా ఉన్నవాటిని ప్రభుత్వ నిషేధిత భూములుగా ప్రభుత్వ భూములను ప్రైవేటు పట్టా భూములుగా మారుస్తూ తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం క్షేత్ర స్థాయి రిపోర్టులనే ప్రామాణికంగా తీసుకుని డిజిటల్ సైన్‌లు చేస్తున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వీటికి ఇటు హెచ్‌ఎండీఏ అటు డీటీసీపీలు కూడా గుడ్డిగా ఎల్పీ నంబర్లు జారీ చేస్తుండటంతో వెంచర్లుగా మారి మార్కెట్లో విక్రయానికి వస్తున్నాయి.
సర్కారు టు ప్రైవేటు
ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌లోని సర్వే నంబర్ 618లో 33.10 ఎకరాల గైరాన్ భూమి రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. 2017 వరకు ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. నాటి రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమి ప్రస్తుతం ప్రైవేటు పట్టా భూమిగా ఎలా మారిందనేదీ అంతుచిక్కడం లేదు.
అసైన్డ్ నుంచి పట్టా
కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్ గ్రామశివారులోని గోవిందాయపల్లితండా సర్వే నంబర్ 52లో ప్రభుత్వ భూమి ఉంది. 1954 ఖాస్రా పహాణిల్లోనూ బంజరు భూమిగా రికార్డై ఉంది. ఇందులో కొంత భూమిని అప్పటి ప్రభుత్వం పేద గిరిజనులకు అసై న్డ్ చేసింది. ఈ భూములపై కన్నేసిన ఓ రియల్టర్ పక్కనే పట్టా భూమిని కొనుగోలు చేసి..ఇటు పక్కన ఉన్న అసైన్డ్ భూములను తన వెంచర్‌లో కలిపేసుకున్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఇక్కడి కొంత అసైన్డ్ భూమి పట్టా భూమిగా మారినట్లు తెలిసింది.
సీలింగ్ టు పట్టా
ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 44లో 13.26 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ శాఖలో సీలింగ్ సర్‌ప్లస్‌గా నమోదైంది. ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమి ఇటీవల పట్టా భూమిగా ఎలా మారిందనేదీ అంతు చిక్కడం లేదు.
హెచ్‌ఎండీఏ భూమి..రిజిస్ట్రేషన్లు
శంషాబాద్ సర్వే నంబర్లలో 720 నుంచి 730 వరకు 50 ఎకరాల హెచ్‌ఎండీఏ భూములు ఉండగా, స్థానిక నేతలు కొంత భూమిని కబ్జా చేసి వెంచర్ వేశారు. ఒకే ఇంటి నంబర్‌తో ఐదు ప్లాట్లు విక్రయించారు. నిజానికి అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకున్నా..వాటిలో ఇళ్లు ఉన్నట్లు నిర్ధారించి ఒకే పీటీఐఎన్ నంబర్‌తో ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం.
దర్జాగా కబ్జా
తలకొండపల్లి మండలం ఖానాపూర్ సర్వే నంబర్ 16,18,20లో 24 ఎకరాలు, సర్వే నంబర్ 145లో 10.24 ఎకరాల పోరంబోకు భూములను భూస్వాములు కబ్జా చేశారు. పట్టా భూముల పక్కనే ఈ భూములు ఉండటం వారికి కలిసి వచ్చింది. హద్దులు నిర్ణయించి భూములను కాపాడటంతో రెవెన్యూ అధికారులు విఫలమైనట్లు విమర్శలు ఉన్నాయి.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి..
రాయదుర్గం ప్రశాంతి హిల్స్ సర్వే నంబర్ 65లో 29 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. ఖాజాగూడ సర్వే నంబర్ 27లో రూ.80 కోట్ల విలువ చేసే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు రాయదుర్గం సర్వే నంబర్46లోని 84.30 ఎకరాలు ప్రభుత్వ భూములపై రియల్టర్ల కన్ను పడింది. మియాపూర్ సర్వే నంబర్ 100, 101లో 445 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉండగా, వీటిలో ఇప్పటికే మెజార్టీ భూములు పట్టా భూములుగా మారి, రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయి.
నాడు వక్ఫ్.. నేడు ప్రైవేటు పట్టా
మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఎలోసుమా రు 500 ఎకరాల వక్ఫ్‌భూమి ఉంది. 1954 నుంచి ఇప్పటి వరకు పట్టా కాలమ్‌లో సయ్యద్ షారాజ్ ఖత్తార్ హుస్సేన్‌సాబ్ దర్గా పేరుతో ఉంది. సర్వే నంబర్ 85,86,88,89 లోని 58 ఎకరాల భూమి వక్ఫ్‌భూమిగా పేర్కొంటూ 2008లో అప్పటి ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. నిన్న మొన్నటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ప్రస్తుతం పట్టా భూములుగా మారడం, వాటికి హెచ్‌ఎండీఏ ఎల్పీ నంబర్ జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment