చంపేస్తాడని.. చంపేశాడు
పాత కక్షల నేపథ్యంలో బావమరిదిని హత్య చేసిన బావ
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
మృతుడు, హతుడు ఇద్దరూ పాత నేరస్తులే ..
మీర్‌పేట: పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం బావమరిదిని హత్య చేసిన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనానికి చెందిన షభానాబేగం కుమారుడు సల్మాన్ (25) పలు కేసుల్లో నిందితుడు. దీంతో పోలీసులు అతనిపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఇదే ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు దాసరి సురేందర్ (32).. సల్మాన్ చెల్లి ఫాతిమాబేగంను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమెను భవనం పైనుంచి తోసి చంపేశాడు. దీంతో సురేందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో సల్మాన్, సురేందర్ మధ్య వైరం పెరిగింది. ఇద్దరూ జైలులో ఉండగా సైతం తరచూ గొడవ పడేవారు.
రెండు నెలల క్రితం (పది రోజుల తేడాలో) ఇద్దరూ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా సల్మాన్ పెద్దనాన్న కూతురు స్వర్ణలతతో సురేందర్ సన్నిహితంగా ఉంటున్నాడు. అప్పటికే తన చెల్లిని చంపాడని రగిలిపోతున్న సల్మాన్ బతికిఉంటే తనకు ప్రమాదమని భావించిన సురేందర్ బావమరిదిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత స్వర్ణలత ద్వారా సల్మాన్‌కు ఫోన్ చేయించి టీకేఆర్ కమాన్ సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి రప్పించాడు. వచ్చీరాగానే సురేందర్ అతనిపై కత్తితో విరుచుకుపడ్డాడు.
గొంతుతో పాటు శరీరంపై దాడి చేయడంతో సల్మాన్ అక్కడికక్కడే కూలిపోయాడు. విషయం తెలుసుకున్న సల్మాన్ తమ్ముడు అర్బాజ్ వెంటనే అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి షభానాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేందర్‌తో పాటు అతని అనుచరులు పరారీలో ఉన్నట్లు సీఐ వివరించారు. సల్మాన్ తల్లి ముస్లిం కాగా తండ్రి హిందువు అని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment