
నేటి నుంచి ‘కులగణన’
ఈనెల 28 వరకు మరో అవకాశం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సమగ్ర కుటుంబ/కులగణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు వివరాలు నమోదు చేయనుంది. గతంలో అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు మూడు మార్గాలను ఎంపిక చేసింది. టోల్ ఫ్రీ నంబర్ సహా ఆన్‌లైన్‌లో ఫాం డౌన్‌లోడ్ చేసుకుని, వివరాలన్నీ పూర్తి చేసి ఇవ్వొచ్చు. మున్సిపాలిటీలు/ మండల కేంద్రాల్లో ఎంపిక చేసిన 37 ప్రజా పాలన సేవా కేంద్రాలకు నేరుగా వెళ్లి వివరాలు సమర్పించొచ్చని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిబట్లలో హైడ్రా మార్క్
అనుమతులు లేని హోర్డింగ్‌ల తొలగింపు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్లలో హైడ్రా కొరడా ఝులిపించింది. అక్రమ హోర్డింగలపై కన్నెర్ర చేసింది. మున్సిపల్ పరిధిలో శనివారం హైడ్రా అధికారులు పర్యటించారు. కొంగరకలాన్, బొంగ్లూర్, ఎంపీ పటేల్‌గూడ, మంగళ్‌పల్లిలో అనుమతులు లేకుండా 16 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి హోర్డింగ్‌లను తొలగించారు. కొంగరకలాన్ అంబేడ్కర్ చౌరస్తా, కల్వకోలు లక్ష్మీదేవమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో, స్టేట్‌బ్యాంకు వద్ద, మంగళ్‌పల్లిలో ఉన్న హోర్డింగ్‌లను పూర్తిగా తీసివేశారు. కొన్నింటికి సాంకేతిక పరమైన చిక్కులు వచ్చాయని వదిలిపెట్టారు. మరికొన్ని హోర్డింగ్‌లను యాజమాన్యాలే స్వయంగా తొలగించుకోవడం విశేషం. మున్సిపల్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగానే హోర్డింగ్‌లు తొలగించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.
దాడి చేసిన వారిపై
కఠిన చర్యలు తీసుకోవాలి
మొయినాబాద్ రూరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆలయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిజాం ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ దేవాదాయ, ధర్మదాయ క్రమబద్ధీకరణ ప్రకారం కీ.శే. శఠగోపాలచారి చిలుకూరు బా లాజీ దేవాలయానికి హక్కుదారునిగా ఉన్నా రని అన్నారు. తమ పూర్వీకుల నుంచి తరతరా లుగా తమ కుటుంబమే దేవాలయ నిర్వ హణ బాధ్యతలు చూస్తున్నామని గుర్తుచేశారు. దైవం అస్తిత్వాన్ని దెబ్బతీసే వారికి దేవాలయ నిర్వహణలో హక్కుకానీ దైవ సంబంధమైన అంశాలపై మాట్లాడే అర్హత కానీ లేవన్నారు.
బీఎండబ్ల్యూ కారు ఢీ.. ట్రాఫిక్ పోలీస్ బూత్ ధ్వంసం
బంజారాహిల్స్: మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ట్రాఫిక్ పోలీసు బూత్ పూర్తిగా ధ్వంసమైంది. డివైడర్లు, దిమ్మెలు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. దోమలగూడకు చెందిన ప్రముఖ వ్యాపారి ఆయుష్ మాలిక్ శుక్రవారం రాత్రి జన్వాడ ఫామ్‌హౌస్‌లో తన స్నేహితుడి విందుకు హాజరయ్యాడు. రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వస్తుండగా ఆయన ముందు రెండు కార్లు ఇష్టానుసారంగా నడుపుతుండగా చూసుకుని నడపాలంటూ చెప్పే క్రమంలో బయటకు తల తిప్పి చూడడంతో కారు అదుపుతప్పి ట్రాఫిక్ పోలీసు బూత్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఎయిర్‌బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయుష్ మాలిక్ క్షేమంగా బయటపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయుష్‌కు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగలేదని తేలింది. కారు మాలిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యిందని, రెండు పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నేటి నుంచి ‘కులగణన’
Comments
Please login to add a commentAdd a comment