![సర్కారు బడులకు కాంట్రాక్టు టీచర్లు](/styles/webp/s3/article_images/2025/02/16/15tnd122-360004_mr-1739670865-0.jpg.webp?itok=ol70AGeZ)
సర్కారు బడులకు కాంట్రాక్టు టీచర్లు
బషీరాబాద్: ప్రభుత్వం డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. దీంతో ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు టీచర్లు కొలువుదీరనున్నారు. 2008లో ఎస్జీటీ పోస్టుల భర్తీలో డీఎడ్ అభ్యర్థులకు 30శాతం వెయిటేజీ ఇవ్వడంతో అప్పడు మెరిట్ జాబితాలో పేరున్నప్పటికీ 2,367 మంది ఉద్యోగానికి దూరమయ్యారు. దీంతో వారు అప్పటి నుంచి పోరాటాలు చేయడంతో 2024 ఫిబ్రవరిలో వీరిని కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ధర్మాసనం ఆదేశాలతో 1,375 మందిని అర్హత కలిగిన అభ్యర్థులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరి నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి అభ్యర్థుల సర్టిఫికెట్లు సైతం వెరిఫికేషన్ చేసింది. పోస్టింగులు ఇవ్వడానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకులు ఉన్నాయని కొంత కాలయాపన చేయడంతో మరోసారి హైకోర్టు జోక్యం చేసుకుంది. ఎన్నికల కోడ్ ఎలాంటి అడ్డుకాదని చెప్పడంతో విద్యాశాఖ పోస్టింగుల ప్రక్రియను ప్రారంభించింది. దీంతో అభ్యర్థుల 17 ఏళ్ల పోరాటానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇకపై కాంట్రాక్టు టీచర్లతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్న ఎస్జీటీ ఖాళీలన్నీ వంద శాతం పూర్తికానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 219 మంది ఎస్జీటీ అభ్యర్థులకు శనివారం అధికారులు నియామక పత్రాలు అందజేశారు. వంద పోస్టుల్లో ముగ్గురికి ఉర్దూ మీడియంలో పోస్టింగ్ ఇచ్చారు.
ఉద్యోగం రెన్యూవల్
కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన టీచర్లను ప్రతీ విద్యా సంవత్సరం ప్రభుత్వం రెన్యూవల్ చేయనుంది. ఇందుకోసం వీరంతా ఏటా అగ్రిమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. వీరి వేతనం బేసిక్ స్కేల్ రూ.31,040గా నిర్ణయించింది. ఎలాంటి అలవెన్సులు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరి సెలవులు మాత్రం వర్తించనున్నాయి. 17 సంవత్సరాల పాటు సర్వీసును కోల్పోయిన కాంట్రాక్టు టీచర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమాలు నడిపించిన వనపర్తి జిల్లాకు చెందిన శ్రీనివాస్ నాయక్‌ను వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. ఈ మేరకు పీఆర్టీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్, అమర్‌నాథ్, శ్రీధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 219 మంది నియామకం
ప్రాథమిక పాఠశాలల్లో వందశాతం ఖాళీలు భర్తీ
ఫలించిన అభ్యర్థుల 17 ఏళ్ల పోరాటం
జిల్లాల వారీగా కేటాయించిన ఎస్జీటీ పోస్టులు
జిల్లా పోస్టులు
వికారాబాద్ 100
రంగారెడ్డి 99
మేడ్చల్ మల్కాజిగిరి 20
Comments
Please login to add a commentAdd a comment